Tuesday, January 21, 2025

25 వరకు జైలులోనే కేజ్రీవాల్: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు రద్దు అయిన ఎక్సైజ్ పాలసీకి ముడిపెట్టిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై హైకోర్టు తన తీర్పును శుక్రవారం రిజర్వ్ చేసింది. ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరంఢిల్లీ హైకోర్టు తన ఉత్తర్వును రిజర్వ్ చేసింది. హైకోర్టు వచ్చే మంగళవారం (25న) తన తీర్పు వెలువరించవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి అప్పటి వరకు తీహార్ జైలులోనే ఉంటారు. ఇడి తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఎస్‌వి రాజు తనకు కేసు వాదనకు దిగువ కోర్టు ‘పూర్తి అవకాశం’ ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు. ‘దీనికి మించిన విరుద్ధమైన ఉత్తర్వు ఉండజాలదు. ఉభయ పక్షాలు దాఖలు చేసిన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే, మాకు ఒక అవకాశం ఇవ్వకుండానే వ్యవహారం తేల్చేశారు’ అని ఆయన చెప్పారు, కేసు వాదనకు గాని. లిఖితపూర్వక వాదనల దాఖలుకు గాని తనకు తగిన సమయం ఇవ్వలేదని ఆయన వాదించారు.

విచారణ నిర్వహణకు జడ్జి హడావిడి పడ్డారని, ఆదరాబాదరా కేసు తేల్చారని ఆయన ఆరోపించారు. డాక్యుమెంట్లు ‘పెద్ద బొంతగా’ ఉన్నాయని జడ్జి చెప్పి, వాటి పరిశీలనకు నిరాకరించినట్లు రికార్డు ఉన్నదని రాజు తెలిపారు, ‘(తాము) పత్రాలను చదవలేదని అంగీకరించిన జడ్జి బెయిల్ మంజూరు చేయడాన్ని బట్టి దీనిని మించిన విరుద్ధమైనదీ ఏదీ ఉండజాలదు. ఈ ఉత్తర్వు దీని ఆధారంగానే ఉండాలి’ అని రాజు వాదించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని సెక్షన్ 45ను రాజు ఉటంకిస్తూ, బెయిల్ ఉత్తర్వును నిలుపుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దిగువ కోర్టు కేసులో వ్యవహరించిన తీరును రాజు తీవ్రంగా ఆక్షేపిస్తూ, ఇడి వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. ‘లిఖితపూర్వక పత్రాన్ని సమర్పించినప్పటికీ ఇడి తన కేసును నిరూపించలేకపోయిందని కోర్టు అనడం చూసి దిగ్బ్రాంతి చెందాను. మీరు నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోండి. కానీ అవాస్తవాలు ఇవ్వకండి’ అని రాజు దిగువ కోర్టు తీర్పులో నుంచి చదువుతూ చెప్పారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇడి సాక్షాధారాలను ఎఎస్‌జి వివరిస్తూ, గణనీయమైన వాస్తవాంశాలను దిగువ కోర్టు తోసిరాజన్నదని వాదించారు. ‘రూ. 100 కోట్లు డిమాండ్ చేయడంలో ఆయన పాత్ర ఉందని మేము చూపాం.

అయినా ప్రత్యక్షంగా ఏ దాఖలా లేదని న్యాయమూర్తి అన్నారు. ప్రత్యక్ష దాఖా వాంగ్మూలం రూపంలో ఉన్నది. దానికి నిర్ధారణ కూడా ఉన్నది’ అని ఆయన వివరించారు. బెయిల్ మంజూరులో దిగువ కోర్టు హేతుబద్ధతను కూడా రాజు విమర్శించారు. ‘రాజ్యాంగబద్ధ పదవి నిర్వహణ బెయిల్‌కు కారణమా? అంటే ప్రతి మంత్రికీ బెయిల్ మంజూరు చేయవచ్చు. మీరు ముఖ్యమంత్రి, కనుక మీకు బెయిల్ మంజూరు చేస్తాం. ఇలా ఎన్నడూ వినలేదు. దీనికి మించిన విరుద్ధమైనది ఏదీ ఉండజాలదు’ అని రాజు అన్నారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక మను సింఘ్వి వాదిస్తూ, ఇడి దృక్పథం గర్హనీయమని అన్నారు. ఎఎస్‌జి రాజు వాదనలను సింఘ్వి తోసిపుచ్చుతూ, ‘ఆయన (ఎఎస్‌జి) ఉత్తర్వును విరుద్ధమైనదని అంటున్నారు. ఒక చిన్న అంశానికి పరిమితం చేస్తున్నారు, ఏలిస్ ఇన్ వండర్లాండ్ వలె విరుద్ధం అంటే ఇడికి సొంత అవగాహన ఉందన్నమాట’ అని పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు బెయిల్‌పై కాకుండా అరెస్టు చట్టబద్ధత అంశాన్ని పరిశీలిస్తున్నాయని సింఘ్వి చెప్పారు.

‘అరెస్టు చట్టబద్ధతపై తన ఉత్తర్వును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది& బెయిల్ మంజూరుపై చట్టం ఎంతో స్పష్టంగా ఉన్నది. బెయిల్ రద్దు/ తిరస్కరణ విభిన్నం’ అని ఆయన వాదించారు. అర్వింద్ కేజ్రీవాల్ ‘ఒక్క పైసా కూడా తీసుకోలేద’ని రుజువు ఉందని సీనియర్ న్యాయవాది చెప్పారు. ‘ఇడికి అధికరణం 21 ఉనికిలో లేనే లేదు. ఒక వ్యక్తి స్వేచ్ఛ, అసలు ఉనికిలో ఉన్నా ఇడి దృష్టిలో అత్యల్పం’ అని ఆయన అన్నారు. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి వెన్ను నొప్పి కారణంగా బెయిల్‌పై ఎలా విడుదల అయ్యారో కూడా సింఘ్వి తెలియజేశారు. ‘కేజ్రీవాల్‌ను ఇరికించకుండా తొమ్మిది స్టేట్‌మెంట్లు ఉన్నాయి. ఆ స్టేట్‌మెంట్ల తరువాత ఆయన నన్ను ఇరికిస్తారు, అప్పుడు ఆయన ఎటువంటి అభ్యంతరమూ లేకుండా వెన్ను నొప్పి కారణంగా బెయిల్ దక్కింది’ అని సింఘ్వి వివరించారు. సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కూడా ఎఎస్‌జి రాజు వాదనను తోసిపుచ్చారు, ‘నాదే రహదారి అనేలా ఇడి వైఖరి ఉంది’ అని ఆయన అన్నారు,

ఇడి తీరును ఆక్షేపించిన సునీతా కేజ్రీవాల్
ఇది ఇలా ఉండగా, తన బెయిల్ ఉత్తర్వును దిగువ కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి ముందే ఇడి ఆ ఉత్తర్వును సవాల్ చేసిందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం ఆరోపించారు, దక్షిణ ఢిల్లీలోని భోగల్‌లో ఒక కార్యక్రమంలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ, దేశంలో నియంతృత్వం శ్రుతి మించి పోయిందని, ఢిల్లీ సిఎంను ‘మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్’ వలె పరిగణిస్తున్నారని విమర్శించారు. ‘బెయిల్ ఉత్తర్వు అప్‌లోడ్ కావడానికి ముందే దానిపై స్టే కోసం ఇడి హైకోర్టుకు వెళ్లింది. నియంతృత్వం దేశంలో శ్రుతి మించి పోయింది. హైకోర్టు ఉత్తర్వు ఇంకా రావలసి ఉంది. కోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆమె చెప్పారు. హర్యానా నుంచి మరింతగా నీటి సరఫరా కోసం ఢిల్లీ నీటి శాఖ మంత్రి ఆతిశీ భోగల్‌లోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News