Thursday, April 3, 2025

రైతు సమావేశం నుంచి ముఖ్యమంత్రి మాన్ వాకౌట్ .. రైతుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

రైతు సంఘాల సమస్యలపై చర్చించడానికి సోమవారం పంజాబ్ ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసినా, మధ్యలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అర్ధంతరంగా వాకౌట్ చేయడంతో ఎలాంటి చర్చలు లేకుండానే అర్ధంతరంగా ముగిసింది. , సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)తోపాటు అనుబంధ రైతు సంఘాల సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశానికి రైతు ప్రతినిధులను ఆహ్వానించింది. అలాగే ఎస్‌కెఎం నేతృత్వంలో మార్చి 5న తలపెట్టిన రైతుల ఆందోళనను రద్దు చేయించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ సమావేశం. అయితే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రైతుల డిమాండ్లు వినకుండా మధ్యలోనే వెళ్లి పోవడం విమర్శలకు దారి తీసింది. తాము చేసిన డిమాండ్లను పట్టించుకోకుండా మార్చి 5న తాము చేపట్టాలనుకున్న ఆందోళనను రద్దు చేయాలని మాత్రమే ముఖ్యమంత్రి ఒత్తిడి చేశారని ఎస్‌కెఎం నాయకులు ఆరోపించారు.

తమ డిమాండ్ల పూర్తి జాబితా అసలు ముఖ్యమంత్రి మాన్ పట్టించుకోలేదని , సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని బీకేయు ఏక్తా ఉగ్రహాన్ అధ్యక్షుడు జోగీందర్ సింగ్ వెల్లడించారు. తమ 18 డిమాండ్లలో కేవలం 8 డిమాండ్లను మాత్రమే ముఖ్యమంత్రి ముందుంచామని మరో ఎస్‌కెఎం నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 6.15 నిమిషాలకు ముగిసిపోయింది. రోడ్లను అడ్డగించి ఆందోళనలు చేపట్టవద్దని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని తాను రైతు నాయకులను అభ్యర్థించానని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. అయితే సమావేశం నుంచి రైతు నాయకులు ఆగ్రహంగా బయటకు వచ్చి తాము అనుకున్న ప్రకారం మార్చి 5న ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News