చండీగఢ్ : పంజాబ్‌లోఅసెంబ్లీ సమావేశ నిర్వహణకు గవర్నర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మంగళవారం సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. విశ్వాస తీర్మానాన్ని సీఎం భగవంత్ మాన్ ప్రవేశ పెట్టారు. తొలుత ఒకరోజు సమావేశం ఏర్పాటు చేయాలని మాన్ సర్కార్ అనుకున్నప్పటికీ అక్టోబర్ 3 వరకు సమావేశాలను పొడిగించారు. కాగా 117 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్‌కు 92 మంది ఎమ్‌ఎల్‌ఎలున్నారు. అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్‌ను గెలిపిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఎలాంటి భయం లేదని, ఈ విషయమై రాష్ట్రం లోని 3 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినట్టు ఆప్ మంత్రి అమాన్ అరోరా తెలిపారు. విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగానే బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు అశ్వని, శర్మ,జాంగిలాల్ మహాజన్ సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి.
జీఎస్టీ, విద్యుత్ సమస్యలు, వ్యర్దాల కాల్చివేత సమస్యలపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిన ఆప్ సర్కారు , సభలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంపై విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వంపై విశ్వాసం నిరూపించుకోవాలంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశాయి. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. రభస చేస్తున్న కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ బయటికి లాక్కెళ్లారు. దాంతో ఆప్ ఎమ్‌ఎల్‌ఎలతో పాటు బీఎస్పీ, ఎస్‌ఎడి ఎమ్‌ఎల్‌ఎలు మాత్రమే సభలో ఉన్నారు. ప్రతిపక్షాల తీరుపై పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మంచి దోస్తి ఉన్నదని, అది ఈరోజు సభలో రుజువైందని ఎద్దేవా చేశారు. బీజేపీయే కాదు, కాంగ్రెస్ కూడా సభను అడ్డుకుంటున్నదని , మమ్మల్ని నోరు తెరవనివ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు ఎమ్‌ఎల్‌ఎలను షేర్ చేసుకుంటున్నాయని ఆరోపించారు.