సిఎం ఆగ్రహం… తక్షణం బదిలీ వేటు
రాయ్‌పూర్ :చత్తీస్‌గడ్‌లో లాక్‌డౌన్ సమయంలో మోటారు సైకిలుపై బయటకు వచ్చిన యువకునిపై దురుసుగా ప్రవర్తించడమే కాక, చేయిచేసుకుని అతని సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసిన సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణవీర్ శర్మ తన ఉద్యోగం కోల్పోవలసి వచ్చింది. సూరజ్‌పూర్‌లో మందులను కొనుక్కోడానికి శనివారం బయటకు వచ్చిన అమన్ మిట్టల్ (23)ను కలెక్టర్ రణవీర్ తోపాటు పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌కు మిట్టల్ ఏదో కాగితం తీసి చూపించి, మొబైల్ ఫోన్‌లో వివరాలు కూడా చూపించాడు. అయితే కలెక్టర్ ఇదేమీ పట్టించుకోకుండా మిట్టల్‌పై చేయిచేసుకోడమే కాక, సెల్‌ఫోన్‌ను విసిరి కొట్టాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయి సంచలనం కలిగించింది.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్రంగా ఆగ్రహించి రణవీర్ శర్మను తక్షణమే విధుల నుంచి తప్పించాలని అధికారులను ఆదేశించారు. . ఆ యువకుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నవరాయ్‌పూర్ సెక్రటేరియట్‌కు బదిలీ చేశారు. రణవీర్ శర్మ స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ కుమార్ సింగ్‌ను కలెక్టర్‌గా నియమించారు. ఐఎఎస్ ఆఫీసర్ల సంఘం కూడా రణవీర్ శర్మ దురుసుతనాన్ని తీవ్రంగా ఖండించింది.