మన తెలంగాణ/హైదరాబాద్ :మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో) అధునాతన వసతుల తో సిఎం క్యాంప్ ఆఫీసు సిద్ధమవుతోంది. మూడు, నాలుగు నెలల్లో ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 భవనంగా దీనిని నిర్మిస్తున్నారు. మంత్రులు, సీనియర్ అధికారులతో సిఎం అత్యవసర సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఈ భవనం రూపుదిద్దుకుంటోంది. జీ ప్లస్ 1గా ఈ భవనం నిర్మాణం జరుగుతోంది. ఇందులో సమావేశం హాల్, నాలుగు సూట్లు, వంటగది ఉంటుంది. తక్కువ నిర్మాణ వ్య యంతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు దగ్గరుండి దీనిని పర్యవేక్షిస్తూ ఈ క్యాంప్ ఆఫీసును నిర్మిస్తున్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జూబ్లీహిల్స్‌లో ని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారిక, అనధికారిక సమావేశాలు అక్కడే నిర్వహిస్తున్నారు.
సచివాలయంలో అధికారులతో రేవంత్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు కొద్ది రోజులుగా బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిఎం సమావేశాలను జరుపుతున్నారు. ఇటీవల రుణమాఫీ పథకంపై అధికారులు, మంత్రులతో సిఎం సమీక్ష చేశారు. సిఎం నివాసానికి ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి కేవలం 2 కి.మీ.ల దూరంలోనే ఉన్నందున, కార్యాలయ సమయాల్లో ట్రాఫిక్ నిలిచిపోవాల్సిన అవసరం ఉండదని దీనిని క్యాంపు కార్యాలయానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో హెలిప్యాడ్ కూడా ఉంది, ఇతర ప్రాంతాల నుంచి నేరుగా అక్కడ దిగాలనుకున్నా అది ఉపయోగపడు తుందని సిఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పనిచేసిన సిఎంలు ఈ ఇనిస్టిట్యూట్‌లో అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారని, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, కొత్త సచివాలయం నిర్మాణంలో ఉన్నప్పుడు ఈ భవన సముదాయం కీలక సమావేశాలకు ఉపయోగపడిందని అధికారులు తెలిపారు. ఈ భవనం పూర్తయితే ఎంసిహెచ్‌ఆర్డీలో సిఎం క్యాంప్ కార్యాలయం కొనసాగనుంది.