తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతుకొవ్వు, చేపనూనె వాడకం జరిగిందనే వివాదం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. జగన్ సారథ్యపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం జరిగిందని సిఎం చంద్రబాబు నాయుడు ల్యాబ్ టెస్టుల నిర్థారణలతో వెల్లడించారు. దీనితో దేశంలో పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. ఈ విషయంపై త్వరలోనే సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశిస్తుందని వార్తలు వెలువడుతున్నాయి. మాజీ సిఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా భోపాల్‌లో హిందూ మత సంస్థలు నిరసన ప్రదర్శనలకు దిగాయి.
జగన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ ఈ విషయంలో దొంగలు ఎవరైనా వదిలేది లేదన్నారు. వారిని ఉరితీయాల్సిందే అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే వారు జైలు పాలు కావల్సిందే అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ ఈ విషయంపై సిబిఐ దర్యాప్తు అత్యవసరం అన్నారు. విజయవాడలో ఆమె ఈ విషయంలో చంద్రబాబు నాయుడు పాత్రను కూడా పూర్తిగా తప్పుపట్టారు.