Monday, July 8, 2024

జల జగడాలు ఆగేనా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ ః ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతి ఏటా జరుగుతున్న జల జగడాలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫుల్‌స్టాప్ పెట్టగలుగుతారా? లేదా? అనే అంశాలపై వాడివేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లో ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిలు తమతమ అధికారుల బృందాలతో ఉన్నతస్థాయిలో సమావేశమవుతుండటం, ఈ సమావేశంలో చర్చకు రాబోయే అంశాలపై ఉన్నతాధికారులు, ఆయా రంగాల్లోని నిపుణుల్లో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో చర్చకు రానున్న అంశాలు, వాటి పరిష్కారానికి సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయనే అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నదీ జలాల వినియోగంపై తలెత్తిన వివాదాలపై జరుగుతున్న చర్చకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలాధారమైన నీటి వినియోగంపైనే కావడంతో జల జగడాలపై మరింత ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్‌లకు శాశ్వత పరిష్కారం కనుగొనగలిగితే ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు చరిత్రలో ఘనంగా నిలిచిపోతాయని, కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం అంత ఈజీకాదని పలువురు సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. ఎందుకంటే కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాలూ నిర్మించిన, నిర్మిస్తున్న, నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించడం, కేంద్ర జల సంఘం (సిడబ్లుసి) ఆదేశాలను బేఖాతరు చేయడం, క్లియరెన్స్‌లు లేకపోయినా ప్రాజెక్టులను నిర్మించుకోవడం, నదీ యాజమాన్య బోర్డులకు డిపిఆర్‌లను ఇవ్వకుండానే ప్రాజెక్టులను నిర్మించుకోవడం…ఇలా ఒక్కటేమిటీ… అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడటంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా పోటీలుపడిమరీ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, వీటికితోడు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నీళ్ళ కోసం ప్రజలకు ప్రాజెక్టుల వద్ద హంగామా సృష్టించడం,

పోలీసులను పంపించి లాఠీ చార్జీలు చేయించడం తద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకునే ఎత్తుగడలకు రెండు రాష్ట్రాలూ పాల్పడుతూ పొలిటికల్ మైలేజ్ కోసం తాపత్రయపడుతున్న పరిస్థితులున్నాయని, మరలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు జరగకుండా శాశ్వత పరిష్కారం కనుగోనడం కష్టమేనని పలువురు నీటిపారుదల రంగంలోని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదీ జలాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, పెరిగిన నీటి అవసరాలకు తగినంతగా నదిలో నీరులేకపోవడం, ఒక్క ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోయినా, ఎగువ నుంచి వరదనీరు ప్రధాన జలాశయాలకు సరిపడా రాకపోయినా నీళ్ళ కోసం కొట్లాటలు జరుగుతూనే ఉంటాయని, ఎందుకంటే రాజకీయపరమైన ప్రయోజనాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని అందుకే జల జగడాలు అంత ఈజీగా సమసిపోయే విధంగా పరిష్కరించడం సాధ్యంకాకపోవచ్చునని నిపుణులు అంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు వివాదాలు ఎక్కువగా ఉన్న కృష్ణానదీ జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో మెజారిటీ అక్రమ ప్రాజెక్టులేనని, అయినప్పటికీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల ప్రయోజనాల రీత్యా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, అలా కాకుండా “నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ” అంటూ పరస్పరం విమర్శించుకొంటూపోతే జల వివాదాలు సమసిపోవని నిపుణులు సీఎంలను కోరుతున్నారు. ఈనెల 6వ తేదీన జరగబోయే సీఎంల భేటీలో అత్యంత ప్రధానమైన, యుద్దప్రాతిపదికన చర్చించి ఏకాభిప్రాయానికి రావాల్సిన అంశం కృష్ణానదిలో నేడున్న నీటిలో 50ః50 నిష్పత్తిలో నీటిని వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయని ఇరిగేషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జస్టీస్ బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో కేటాయించిన 811 టిఎంసిల నీటిలో రాష్ట్రాల విభజన అనంతరం ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిల నీటిని వాడుకునే విధంగా తాత్కాలికంగా పంపకాలు చేశారని,

కానీ దీని మూలంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందనే విషయాన్ని ఇరువురూ పట్టుదలలకు పోకుండా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత పరిమాణంలో నీటి అవసరాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగానే తెలంగాణకు కూడా నీటి అవసరాలు ఉన్నాయనే విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, ప్రజలు గుర్తించాలని కోరుతున్నారు. అలా కాకుండా అక్రమ ప్రాజెక్టుల గురించి చర్చించుకొని కేకలు వేసుకొని సమావేశాలను ముగించుకొంటూ ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ అక్రమ ప్రాజెక్టులున్నాయని, రెండు రాష్ట్రాల్లోనూ క్లియరెన్స్‌లు లేనివే అధికంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేవని, అంతేగాక పెన్నానది ఆయకట్టులో ఉన్న ప్రాంతానికి కృష్ణానదీ జలాలను తరలించడం ముమ్మాటికీ అక్రమమేనని, ఇలా అక్రమాలకు పాల్పడుతూ ఎపి ప్రభుత్వం గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్),

హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్), వెలిగొండ ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్డు ప్రాజెక్టు, గండికోట, గోరకల్లు, మైదుకూరు… ఇలా ఎన్నో ప్రాజెక్టులు అక్రమమైన నిర్మాణాలేనని, ఒక్క తెలుగుగంగ ప్రాజెక్టును మాత్రం చెన్నై నగరానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించారని, ఆ ఒక్క ప్రాజెక్టు కోసం శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని చెన్నై నగరానికి తరలించడానికి తెలుగుగంగను నిర్మించారని, ఈ ఒక్క అంశాన్ని సాకుగా తీసుకొని మిగతా అన్ని ప్రాజెక్టులను కృష్ణానదీ జలాలను ఆధారంగా చేసుకొని నిర్మిస్తూ ఎపి ప్రభుత్వం అన్నిరకాల ఉల్లంఘనలకు పాల్పడుతూ వచ్చిందని, ఈ కఠోర వాస్తవాలను ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించుకొని సమయం వృధా చేసుకోవద్దని కోరుతున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కృష్ణానదీ జలాలను ఆధారంగా చేసుకొని అనేక అక్రమ ప్రాజెక్టులు, క్లియరెన్స్‌లు లేనటువంటివే నిర్మాణం జరుగుతున్నాయని, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కోయిల్‌సాగర్…

తదితర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేవని, అయినప్పటికీ వాటిని నిర్మిస్తూనే ఉన్నారని… అందుచేతనే రెండు రాష్ట్రాలూ “తేలుకుట్టిన దొంగల మాదిరి”గా మౌనం వహించి, అందుబాటులో ఉన్న నీటిని చెరిసగం వాడుకుంటే మంచిదని ఆ నిపుణులు సూచిస్తున్నారు. జస్టీస్ బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 1005 టిఎంసిల నీటిని చెరిసగం పంపకాలు జరిపి, ఆ పైన 45టిఎంసిల నీటిని అదనంగా తెలంగాణకు కేటాయించాల్సి ఉందని, ఎందుకంటే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి నదీ జలాలను ఎపి ప్రభుత్వం కృష్ణాడెల్టా ప్రాంతానికి తరలిస్తున్నందున దామాషాగా తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటానీరు ఆ 45 టిఎంసిలని వివరించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వంటి కామన్ ప్రాజెక్టులను అప్పగించవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సమర్ధించాలని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్ధికంగా అనేక నష్టాలు ఉంటాయని, ప్రజా ప్రభుత్వాలపైన అధికారులతో కూడిన బోర్డు పెత్తనం చేయడం సమంజసం కాదనే వాదనలకు ఎపి సీఎం ఎలా రియాక్టు అవుతారోననే అంశాలపై చర్చ జరుగుతోంది. అంతేగాక ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)ని రద్దు చేయమని కేంద్రాన్ని కోరవచ్చునని, తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకూ ఏటా సుమారు 250 కోట్ల రూపాయల నిధులు ఆదా అవుతాయని ఆ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి తెలుగు ప్రజల పరస్పర ప్రయోజనాలను కాంక్షిస్తూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News