Monday, January 27, 2025

గ్రాండ్ హైదరాబాద్ ముందు బాబు బ్రాండ్ వెలవెల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోల్చుకున్నప్పుడు రాజకీయాల్లో చాలా జూనియర్. 2006 లో మొదటిసారి ఆయన ప్రజా జీవితంలో ఒక ఎన్నిక గెలిచారు. ఆ తరువాత శాసన సభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా పని చేసినా గత ఏడాది ముఖ్యమంత్రి అయ్యేవరకు ఆయన ఏనాడూ కనీసం మంత్రిగా పనిచేయలేదు. ఆయన సభ్యుడిగా ఉన్న పార్టీ ఏదీ అధికారంలో కూడా లేదు. పరిపాలనకు కొత్తే అయినా రేవంత్ రెడ్డి ఇన్ని పెట్టుబడులు ఎలా తేగలిగారు? పరిపాలనలో తలపండిపోయిందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎక్కడ విఫలమయ్యారు?

ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి దావోస్ లో ఎవరూ అంతగా ఉత్సాహం చూపకపోవడానికి కారణం ఆ రాష్ట్రంలోని రాజకీయ అనిశ్చితి పరిస్థితులే తప్ప మరొకటి కాదు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు స్థిరంగా ఉన్న విషయం, ప్రస్తుతం ఉన్నది మూడు పార్టీల కూటమి సర్కార్ అన్న విషయం పెట్టుబడులు పెట్టేవారికి తెలియకుండా ఉంటుందా?

జాతీయ న్యూస్ ఛానల్ ‘ఇండియా టుడే’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రా హుల్ కన్వల్ ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన సందర్భం గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ‘ఒరిజినల్ దావోస్ మాన్ అఫ్ ఇండియా’ (అసలైన దావో స్ మనిషి) అని అభివర్ణించారు. దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తదితరులకు కల్పించాల్సిన ప్రచారంకోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే మూడు జాతీయ మీడియా సంస్థలకు రెండున్నర కోట్ల రూపాయలు కేటాయించింది.

అందులో 61 లక్షల రూపాయలు బిజినెస్ టుడేకు కూడా ముట్టాయి. చెల్లించిన సొమ్ముకు గిట్టుబాటు అయితే అయింది. ఆ మూడు జాతీయ ఛానళ్లు వారికి బాగానే ప్రచారం కల్పించాయి. అయితే దావోస్‌కు వెళ్ళిన లక్ష్యం నెరవేరిందా? ‘ఒరిజినల్ దావోస్ మాన్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఏమయినా సాధించారా? తమ రాష్ట్రాల్లో ఉన్న సానుకూలతలను వివరించి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతి సంవత్సరం దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళుతుండటం ఆనవాయితీ. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోవాలి. ఈసారి దావోస్ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కూడా కేంద్రంనుంచి అనుమతి లభించింది.

గత ఏడాది కూడా, అధికారంలోకి వచ్చిన నెలరోజులలోనే దావోస్ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం వెళ్లి 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ మేరకు ఎమ్‌ఒయుల మీద సంతకాలు కూడా చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకోసం గత ఏడాది దావోస్ సదస్సు సందర్భంగా ఎంఒయులు కుదుర్చుకుంటే అందులో అదానీ గ్రూపునకు సంబంధించిన ప్రాజెక్టు మినహాయిస్తే మిగతా 17 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి తాజా పర్యటనలో దావోస్‌లో ఇదే రాహుల్ కన్వల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈసారి దావోస్‌లో తెలంగాణకు సంబంధించి రికార్డ్ స్థాయిలో పారిశ్రామిక పెట్టుబడులకు ఎంఒయులు కుదుర్చుకొని తిరిగి వచ్చింది తెలంగాణ ప్రతినిధి బృందం. లక్షా 79 వేల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంఒయులు కుదుర్చుకున్నది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం లో అప్పటి ఐటి పరిశ్రమల మంత్రి కెటి రామారావు దావోస్‌కు వెళ్లి చేసుకున్న ఒప్పందాల మొత్తం విలువ 21 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పనిచేసిన కాలంలో కూడా దావోస్‌లో ఇంత పెద్ద మొత్తంలో ఒప్పందాలు జరిగి ఉండవు. నిజానికి దావోస్‌కు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. అందుకే రాహుల్ కన్వల్ ఆయనను ‘ఒరిజినల్ దావోస్ మాన్ ఆఫ్ ఇండియా’ అని ఉంటాడు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వెళ్లినన్నిసార్లు బహుశా ఏ ముఖ్యమంత్రి వెళ్లి ఉండకపోవచ్చు.

ఆ విషయంలో ఆయనకు చాలా అనుభవం ఉన్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని అత్యధికంగా 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంఒయులు కుదుర్చుకున్నప్పటికీ ఈసారి దావోస్‌లో తెలంగాణ హైలైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం ఆంధ్రప్రదేశ్ వలే దావోస్ ప్రచారానికి జాతీయ మీడియా సంస్థలను ప్రచారంకోసం కుదుర్చుకోలేదు. తెలంగాణ టీంతో ఒక మీడియా డైరెక్టర్ మాత్రమే వెళ్లినట్టున్నారు. మూడు రాష్ట్రాలలో ఈసారి అసలు ఒక్క ఎంఒయు కూడా కుదుర్చుకోని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒరిజినల్ దావోస్ మాన్ గా ప్రసిద్ధుడైన చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ఎందువలన ఈసారి అసలు పెట్టుబడులను ఆకర్షించలేకపోయింది? ఇక్కడ జాతీయ మీడియా ఛానళ్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ఆసక్తికరమైన విషయాలు కొన్ని మనం చెప్పుకోవాలి.

బిజినెస్ టుడే ప్రతినిధి రాహుల్ కన్వల్ చంద్రబాబు ప్రస్తావన తెచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇది గవాస్కర్, సచిన్ టెండూల్కర్ల కాలం కాదు. ఇప్పుడు నడుస్తున్నది విరాట్ కోహ్లీ యుగం అన్న ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడును లెజెండ్ అని అభివర్ణిస్తూనే ఆయన జమానా అయిపోయిందని చెప్పకనే చెప్పినట్టు అయింది. తన పోటీ ఆంధ్రప్రదేశ్‌తో గాని, ఇరుగుపొరుగు రాష్ట్రాలతోగాని కాదని న్యూయార్క్, దుబాయ్, సింగపూర్ వంటి మహానగరాలతోనే అని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పోల్చుకున్నప్పుడు రాజకీయాల్లో చాలా జూనియర్. 2006లో మొదటిసారి ఆయన ప్రజా జీవితంలో ఒక ఎన్నిక గెలిచారు. ఆ తరువాత శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసినా గత ఏడాది ముఖ్యమంత్రి అయ్యేవరకు ఆయన ఏనాడూ కనీసం మంత్రిగా పనిచేయలేదు. ఆయన సభ్యుడిగా ఉన్న పార్టీ ఏదీ అధికారంలో కూడా లేదు.పరిపాలనకు కొత్తే అయినా రేవంత్ రెడ్డి ఇన్ని పెట్టుబడులు ఎలా తేగలిగారు? పరిపాలనలో తలపండిపోయిందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎక్కడ విఫలమయ్యారు?

పెట్టుబడులను ఆకర్షించడంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు, ఆయనను సమర్థించే మీడియా సంస్థలు తెగ ప్రయత్నం చేశాయి. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వచ్చేది పెట్టుబడుల కోసం కాదు.. పరిచయాలు పెంచుకోవడానికి, అనుభవం సంపాదించడానికి అని చెప్పారు. మరి గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే దావోస్ నుంచి లెక్కలేనని పెట్టుబడులు సాధించుకొచ్చానని ఎందుకు చెప్పుకున్నారో తెలియదు. ఇక ఆయనను సమర్థించే మీడియా సంస్థలు ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి నానా అవస్థలు పడుతున్నాయి. దావోస్ నుండి ఆయనను నేరుగా అమరావతి కాకుండా ఢిల్లీ మీదుగా వచ్చేట్టు చేసి ఆ ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకుని కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు పదకొండువేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన వార్తను హైలైట్ చేసి, అలాగే దావోస్‌లో లోకేష్ బాబు ఎన్ని సమావేశాల్లో పాల్గొన్నాడు ఎంతమంది ఇన్వెస్టర్‌లతో చర్చలు జరిపాడనే విషయాలను హైలైట్ చేసి, లక్షకోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయి. తాము ముందు వచ్చేశామని ఆయనతో చెప్పించి తండ్రీకొడుకుల ప్రతిష్ఠ పెంచడానికి తిప్పలు పడ్డాయి.

అయితే వాస్తవాలు వేరేగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి దావోస్‌లో ఎవరూ అంతగా ఉత్సాహం చూపకపోవడానికి కారణం ఆ రాష్ట్రంలోని రాజకీయ అనిశ్చిత పరిస్థితులే తప్ప మరొకటి కాదు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు స్థిరంగా ఉన్న విషయం, ప్రస్తుతం ఉన్నది మూడు పార్టీల కూటమి సర్కార్ అన్న విషయం పెట్టుబడులు పెట్టేవారికి తెలియకుండా ఉంటుందా? పరిశ్రమలు పెట్టాలనుకునేవాళ్ళు చాలా విషయాలు ఆలోచిస్తారు. అందులో ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులతోపాటు రాజకీయ పరిస్థితులను, శాంతిభద్రతల పరిస్థితులను కూడా అంచనా వేసుకుంటారు. రాజకీయంగా సుస్థిరత, భౌగోళికంగా అన్ని రకాలుగా అది అనువైన ప్రాంతంగా ఉంటేనే పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు.
అటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో లోపించాయనేది పెట్టుబడిదారుల అభిప్రాయం అని మొన్నటి దావోస్ వైఫల్యంతో స్పష్టంగా అర్థం అవుతున్నది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజినెస్ టుడే ఇంటర్వ్యూలో ‘ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ లేదు, నాకు హైదరాబాద్ ఉంది. నా బలం హైదరాబాద్ నగరంలోనూ, అక్కడి ప్రపంచఖ్యాతి చెందిన విద్యా సంస్థలలోనూ ఉన్నది. భారత దేశంలోని ఏ నగరమైనా.. హైదరాబాద్‌తో పోటీ పడలేదు. హైదరాబాద్ హైదరాబాదే’ అన్నమాట అక్షరాలా నిజం.తెలంగాణకు దావోస్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడుల హామీలు రావడానికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరం, దానిని షో కేస్ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం సమర్ధత. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఉన్న సానుకూలతలతోపాటు ప్రభుత్వ అధినేతలు స్పందించే తీరునుబట్టి కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తెలంగాణలో ఇవన్నీ కలిసి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం వర్క్ కు తోడు ఏ హడావుడి లేకుండా తెలంగాణ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తన పని తాను చక్కబెట్టుకురావడం కూడా తోడ్పడింది. ఇక ఈ ఎంఓయూలు కార్యరూపం దాల్చి పెట్టుబడులు తెలంగాణకు వచ్చే విధంగా పనిచేయాల్సిన బాధ్యత సజావుగా నెరవేర్చినట్లైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం చాలా ఉంది. దావోస్‌కు కూతవేటు దూరంలో జ్యురిచ్ లో ఈ సందర్భంగా యురోపియన్ తెలుగు కమ్యూనిటీ పేరిట తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన సభలో ఒకాయన చంద్రబాబే ఒక బ్రాండ్ అన్నాడు. హైదరాబాద్ బ్రాండ్ ముందు బాబు బ్రాండ్ దావోస్ లో వెలవెలబోయింది.

amar devulapalli

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News