చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. చిత్తూరు- బెంగళూరు ప్రధాన రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు, పలమనేరు వైపు నుంచి వస్తున్న ఇనుప కమ్మీలతో కూడిన లారీ ఢీ కొన్నాయి. దీంతో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్డీసీ బస్సు డ్రైవర్‌తో పాటు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు తరలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి : చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మొగిలిఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణాశాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొగలిఘాట్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే రోడ్డు ప్రమాదంలో 8మంది మృతి చెందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ , మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.