ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో సమావేశమయ్యారు. ముంబయిలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు చంద్రబాబు సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు శనివారం రాత్రి ముంబయిలో బస చేశారు. ముంబయిలోని వర్ష భవన్ లో ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు. చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన షిండే ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఇరువురి మధ్య సమావేశం జరిగింది. ఎన్డీయే కూటమి భాగస్వాములైన చంద్రబాబు, షిండే పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు,
పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతులు అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇద్దరు సిఎంల మధ్య దాదాపు అరగంటపాటు చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫొటోలను సిఎం ఏక్‌నాథ్ షిండే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు షిండే పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పిడబ్లూడీ మంత్రి దాదా భేసే, షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.