Monday, January 20, 2025

పంజాబ్‌లో ఎన్నికలు ఆపండి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. గురురవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32శాతం ఉన్నారన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బెనారస్‌లో జరగనున్న గురురవిదాస్ జయంతి వేడుకలకు పంజాబ్ నుంచి దాదాపు 20 లక్షల మంది వెళ్లే అవకాశం ఉన్నట్టు సీఎం తెలిపారు.

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరని, అందుకోసం కనీసం ఆరు రోజులపాటు వాయిదా వేసి తదుపరి నిర్వహించాలని లేఖలో కోరారు. అంతకుముందు పంజాబ్ బీఎస్పీ చీఫ్ జస్వీర్ సింగ్ గర్హి కూడా ఎన్నికలను రీ షెడ్యూల్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కాగా, భారతీయ జనతా పార్టీ కూడా ఇదే విషయమై ఇసికి లేఖ రాసింది. గురురవిదాస్ జయంతి (ఫిబ్రవరి 16) వేడుకల అనంతరం ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. కాగా, 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

CM Channi urges EC to postpone polls in Punjab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News