మధ్యప్రదేశ్ క్యాబినెట్ భేటీలో అసాధారణ దృశ్యం
భోపాల్: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మంగళవారం జరిగిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఒక అసాధారణ దృశ్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాను కూర్చునే కుర్చీని మహా శివుడి చిత్రపటానికి అర్పించి తాను వేరే కుర్చీలో కూర్చుని మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. క్యాబినెట్ సమావేశం జరిగినపుడు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న టేబుల్ మధ్యలో ఉండే కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో మహా శివుడి భారీ చిత్రపటం ప్రత్యక్షమైంది. మధ్యప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉజ్జయినిలో జరిగింది. టేబుల్‌కు చెరో చివర ముఖ్యమంత్రి చౌహాన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ ఎస్ బైన్స్ ఆశీనులయ్యారు.
కాగా..ఈ పరిణామంపై మాజీ ప్రభుత్వ అధికారులు విమర్శించగా అధికార బిజెపి నేతలు, హిందూ స్వామీజీలు హర్షం వ్యక్తం చేశారు. ఇది అసాధారణమని, ఇది తీవ్ర విమర్శలకు దారితీస్తుందని మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఓపి రావత్ బుధవారం వ్యాఖ్యానించారు. భగవంతుడికి రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు వ్యక్తం చేయదలిస్తే మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లి ఉండవచ్చని ఆయన చెప్పారు. ఇది సమర్థించుకోలేని చర్యగా మధ్యప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ కృపా శంకర్ శర్మ వ్యాఖ్యానించారు. ఇతర మతాలకు చెందిన వారు డిమాండు చేస్తే వారి కోరికను కూడా మన్నించగలరా అని మరో రిటైర్డ్ అధికారి ప్రశ్నించారు. ఈ క్యాబినెట్ సమావేశంలో కొత్తగా నిర్మించిన మహాకాళేశ్వర్ ఆలయ కారిడార్‌కు మహాకాళ్ లోక్‌గా నామకరణ చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో 856 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మహాకాళేశ్వర్ ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 11న ప్రారంభించనున్నారు. 2023 నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది.