Monday, January 20, 2025

29న ఎల్‌బి స్టేడియంలో సిఎం కప్ రాష్ట్ర క్రీడలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 29వ తేదీన ఎల్బీ స్టేడియంలో సిఎం కప్ టోర్ని క్రీడలను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్పోర్ట్ కాంప్లెక్స్, కేబీఆర్ ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, సికింద్రాబాద్ జింంఖానా గ్రౌండ్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ షూటింగ్ రేంజ్, గచ్చిబౌలి ప్రాంతాలలో సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తారు. శాట్స్ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ సిఎం కప్ క్రీడల ప్రారంభోత్సవానికి మంత్రి కెటి. రామారావు ముఖ్యఅతిథిగానూ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పలువురు మంత్రులు, తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, అలాగే పలు శాఖల ఉన్నతాధికారులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడలను విజయవంతం చేయాలని క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పిలుపు నిచ్చారు.

ఈనెల 15 నుండి 31 వరకు సీఎం క్రీడలు ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా స్థాయి విజేతలు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొననున్నారు. ఇలా ఈనెల 28 నుండి 31 వరకు హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో సీఎం కప్ టోర్నీ క్రీడల నిర్వహణ నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బుధవారం పలు శాఖల అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సి హరీష్, పర్యాటకశాఖ ఎండి మనోహర్, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్, మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు అలాగే శాంతిభద్రత విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్, సిటీ పోలీస్ కమిషనర్ ఇంకా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ క్రీడాకారులు దాదాపు పదివేలకు పైగా హాజరుకానున్నందున తాగునీరు పారిశుద్ద్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ నెల 27 నుండి క్రీడాకారులు హైదరాబాద్ చేరుకోనున్నందున మొత్తం ఆరు స్టేడియాల పరిధిలో అన్నిరకాల బందోబస్తు చర్యలు , నిరంతరాయ విద్యుత్ సౌకర్యం సమకూర్చాలని పోలీస్ ట్రాన్స్ కో అధికారులకు ఆయన సూచించారు. ఈ నెల 29న ఎల్‌బి స్టేడియంలో సిఎం కప్ రాష్ట్ర క్రీడలు మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం కప్ టోర్నీ క్రీడల ప్రారంభ కార్యక్రమానికి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తదితర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మార్చ్ ఫాస్ట్, ప్రముఖ క్రీడాకారులకు సన్మానం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు దాదాపు 200 బస్సులతో స్టేడియంకు చేరుకోనున్నందున ట్రాఫిక్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని పోలీస్ అధికారులను ఆయన కోరారు.

అలాగే క్రీడాకారుల బస ప్రాంతాలలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు, ఎమర్జెన్సీ అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. ట్యాంక్ బండ్, స్టేడియాలు క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చే భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి స్టేడియం ఒక ఇన్చార్జిగా జిల్లా అధికారినీ నియమించాలని కోరారు. హైదరాబాద్ , రంగారెడ్డి కలెక్టర్లు క్రీడల నిర్వహణ విషయంలో నోడల్ అధికారులుగా వ్యవహరించాలని సందీప్ కుమార్ సుల్తానియా కోరారు. మెట్రో వాటర్ బోర్డ్, విజయ డైరీ సమన్వయంతో తాగునీరు, మజ్జిగ పాకెట్లు సరఫరా బాధ్యతలు తీసుకోవాలని దాదాపు 3,700లకు పైగా బాలికలు మహిళలు పాల్గొంటున్నందున ప్రత్యేక ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు దొరలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడాకారులను జిల్లా స్థాయి నుండి బస్సులు ఏర్పాటు చేసి డిఆర్‌డిఓల పర్యవేక్షణలో హైదరాబాద్‌కు తరలించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News