Sunday, December 22, 2024

షిండేకు ముప్పేట పోటు

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో ఇప్పుడు కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్‌తో ఒక్కరోజు క్రితమే రాత్రిపూట సుదీర్ఘంగా చర్చించారు. మరో వైపు అజిత్ పవార్ వర్గీయులు కేబినెట్‌లోకి ప్రవేశించడంపై ఇప్పటికే షిండే బృందంలో అసంతృప్తి ఆరంభం అయింది. కొత్తగా వచ్చిన అజిత్ పవార్ వర్గీయులకు కేబినెట్ శాఖలను కేటాయించాల్సి ఉంది. వీరికి ప్రాధాన్యతగల శాఖలు కేటాయిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని వార్తలు వెలువడుతున్నాయి. దీనితో పరిస్థితిని సమీక్షించుకునేందుకు షిండే సుదీర్ఘ స్థాయిలో ఫడ్నవిస్‌తో మంతనాలు జరిపారు. షిండే అత్యంత సన్నిహితులు అయిన కొందరు ఎమ్మెల్యేలు తమ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ మేరకు వారి నుంచి తమకు సంకేతాలు అందుతున్నాయని ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన నేతలు తెలిపారు.

త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మారుతాడనే ఊహాగానాలు చెలరేగాయి. ఇప్పుడు షిండే అటు సొంత వర్గం, బిజెపి ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన అజిత్ పవార్ గ్రూప్‌ను సంతృప్తిపరుస్తూ వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇతర పార్టీల వారు కేబినెట్‌లోకి రావడం వల్ల సహజంగానే తమ పార్టీలోని వారిలో అసంతృప్తి ఉంటుందని, అయితే రాజకీయాలన్నాక సర్దుబాట్లు తప్పవని షిండే వర్గపు ఎమ్మెల్యే సంజయ్ శిర్షత్ తెలిపారు. అయితే తమ క్యాంప్‌లో తిరుగుబాటు ధోరణి ఉందనే వాదనను షిండే అనుచరులు తోసిపుచ్చారు. అయితే తన వర్గంలో పూర్తిస్థాయిలో తలెత్తుతోన్న నిరసనలతోనే షిండే హుటాహుటిన ఫడ్నవిస్‌తో చర్చించినట్లు , దాదా (అజిత్ పవార్) ఎమ్మెల్యేల రాకతో ఇక తమ పరిస్థితి ఏమిటనే కలత షిండే వర్గంలో చోటచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News