ముంబై : మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా కోటాపై బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తరువాత షిండే ఈమేరకు ప్రకటించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం మరాఠా కోటాకు డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మనోజ్ బరాంగే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మరాఠాలకు రిజర్వేషన్లు వర్తింప చేసేందుకు ప్రభుత్వంతో సహకరించాలని జరాంగేకు అఖిలపక్షం విజ్ఞప్తి చేసిందని సీఎం షిండే తెలిపారు.
రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వానికి సమయం అవసరమని , ఈ విషయంలో మరాఠాలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, అంతకు ముందు ఈ అంశంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర లోని బీడ్‌లో సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలను ఫడ్నవీస్ ఖండించారు.
హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని, ఈ దిశగా ఈరోజే కొన్ని నిర్ణయాలు వెలువడతాయని , కానీ కొందరు హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని , అలాంటి శక్తులను ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. బీడ్ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు.