Monday, December 23, 2024

జార్ఖండ్ పరిణామాలు!

- Advertisement -
- Advertisement -

ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్) కేసు బిగుసుకొన్న నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు. పార్టీలోని సీనియర్ నాయకుడు చంపై సోరేన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అధికార కూటమి నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తన స్థానంలో తన భార్య కల్పనా సోరేన్‌ను సిఎంను చేయాలని హేమంత్ మొదట్లో అనుకొన్నారు. కాని చంపై సోరేన్‌కు ఆ అవకాశం కల్పించడం సమంజసంగా వుంది. జార్ఖండ్‌లో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జెడి (రాష్ట్రీయ జనతాదళ్) కూటమి పరిపాలిస్తున్నది. ముఖ్యమంత్రి కాబోతున్న చంపై సోరెన్ ఏడు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా చేస్తున్నారు.

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి జార్ఖండ్ టైగర్ అనిపించుకొన్నారు. 81 మంది సభ్యులు గల జార్ఖండ్ శాసన సభలో జెఎంఎం కూటమికి 48 మంది మద్దతు వున్నది. ఇందులో జెఎంఎం బలం 29 కాగా, కాంగ్రెస్ పార్టీ 17, రాష్ట్రీయ జనతాదళ్ 1, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్ లెనినిస్ట్) లిబరేషన్ పార్టీ 1 స్థానాలు కలిగి ఉన్నాయి. హేమంత్ సోరెన్ కోసం ఇడి వేట పరమ జుగుప్సాకరంగా సాగింది. ఆయన ఢిల్లీ నివాసం నుంచి ముసుగు వేసుకొని దొడ్డి దారిలో పారిపోయినట్టు జరిగిన ప్రచారం బహుశా ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి విషయంలోనూ జరగలేదు. గిరిజన ముఖ్యమంత్రి కావడం వల్లనే బిజెపి ఇంతగా పగబట్టిందా అనే అభిప్రాయానికి అవకాశం కలిగింది. ఇడికి భయపడి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరారీ అయ్యారని మీడియాలో వచ్చిన వార్త ఆశ్చర్యానికి గురి చేసింది.

ముందుగా తెలియజేయకుండా ఇడి అధికారులు న్యూఢిల్లీలోని తన నివాసానికి వచ్చి తాను పారిపోయినట్టు దుష్ప్రచారం చేశారని, తన ప్రతిష్ఠను దెబ్బ తీశారని సోరెన్ రాంచి పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేశారు. దానితో వారు ఇడి అధికారుల మీద ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద ప్రాథమిక అభియోగ పత్రాన్ని (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశారు. ఒక భూసంబంధ వ్యవహారంలో అక్రమార్జనకు పాల్పడ్డారని, తదితర కేసుల్లో ప్రశ్నించడానికి సోమవారం నాడు ఢిల్లీలోని సోరెన్ నివాసానికి వెళ్లి రూ. 36 లక్షలు, ఖరీదైన ఒక కారును ఇడి స్వాధీనం చేసుకొన్నది. ఆయనను ప్రశ్నించడానికి 13 గంటల పాటు ఎదురు చూశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదురుగా లేనప్పుడు నివాసంలో చొరబడి సోదాలు చేయవలసినంత అత్యవసరం ఇడి అధికారులకు ఎందుకు కలిగిందో అర్ధం కాదు. సోరెన్ తన ఇంట కనబడకపోయేసరికి భయపడి పారిపోయారని బిజెపి పెద్దలు నిందా ప్రచారం చేయడంలోని రాజకీయం తెలిసిందే.

భూమి అక్రమ బదలాయింపు కేసులో గత 20వ తేదీన హేమంత్ సోరెన్‌ను ఇడి ప్రశ్నించింది. ఈ కేసులో ఇంత వరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒక ఐఎఎస్ అధికారి కూడా ఉన్నారు. రాష్ట్రపతి పాలన విధించే దురుద్దేశంతో బిజెపి పావులు కదుపుతున్నదని పాలక కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి. సోమవారం నాడు ఢిల్లీలో కనిపించని సోరెన్ మంగళవారం నాడు రాంచిలో ప్రత్యక్షమయ్యారు. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రశ్నించిన ఇడి హేమంత్ సోరెన్‌ను కస్టడీలోకి తీసుకొన్నట్టు సమాచారం. కేంద్రంలోని బిజెపి పాలకులు ప్రతిపక్ష నేతలపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వారిని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇడిని, సిబిఐని పదేపదే ప్రయోగిస్తున్నారు. కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే ఇడి కేసులు పెట్టి సోదాలు నిర్వహించి ప్రముఖులను అరెస్ట్ చేస్తున్నది. మధ్యప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎన్నో అవినీతి కుంభకోణాలు వున్నప్పటికీ ఇడి గాని, సిబిఐ గాని అక్కడ అడుగు పెట్టడం లేదు.

మద్యం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకొని ఎనిమిది మాసాలైంది. ఈ కేసులో సిసోడియా డబ్బు తీసుకొన్నట్టు సాక్ష్యం లేనందున ఆయనను ప్రధాన నిందితున్ని చేయగూడదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అయినా బెయిల్ దొరక్కుండా సిబిఐ అడ్డుకొంటున్నది. మాసాలు, ఏళ్ల తరబడి ప్రశ్నించడం, చివరికి సరైన సాక్ష్యాధారాలు సేకరించలేక చతికలబడడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు మామూలైపోయింది. ఈలోగా ఈ నాయకుల ప్రతిష్ఠ మంటగలిసి బిజెపి రాజకీయంగా లబ్ధి పొందుతున్నది. సిబిఐ, ఇడి కేసులు నమోదైన తర్వాత వాటి నుంచి తప్పించుకోడానికి బిజెపిలో చేరుతున్న నాయకులున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సైతం సమన్లు జారీ అయ్యాయి. ఆయన హాజరు కాకుండా తప్పించుకొంటున్నారు. ఇడి గాని, సిబిఐ గాని కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నాయకులనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం వల్ల వాటి నిష్పాక్షికత నాశనమవుతున్నది. దేశానికి ఇంతకంటే హాని ఇంకొకటి ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News