Thursday, January 23, 2025

ముఖ్యమంత్రి ఆయనే… కూటమే కొత్తది

- Advertisement -
- Advertisement -

బిజెపి మద్దతుతో ప్రమాణస్వీకారం

కమలం నుంచి ఇద్దరు డిప్యూటీ సిఎంలు

మొత్తం మీద ఎనమండుగురితో కొలువు
ఘట్‌బంధన్‌తో తెంచుకుని రాజీనామా

కాషాయంతో వియ్యంతో పదవీస్వీకరణ

గంటల వ్యవధిలోనే మారిన రంగులో పీఠంపై

పాట్నా : ఆదివారం ఉదయం రాజీనామా, కొద్ది గంటల వ్యవధిలోనే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా , జెడియు అధినేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. సిఎం ఆయన రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి సిఎం గా బాధ్యతలు తీసుకున్నారు. రోజుల తరబడి సాగిన రాజకీయ ఉత్కంఠ, ఎన్‌డిఎ , ఇండియా కూటమి బలాబలాల బేరీజుల విశ్లేషణల నడుమ ఆయన ఎట్టకేలకు బిజె పి సారధ్యపు ఎన్‌డిఎ మద్దతుతో తిరిగి బీహార్ పీఠం అధిష్టించారు. ఆదివారం ఉదయం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ రాజ్‌భవన్‌లో బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా ఇతర సీనియర్ నేతల సమక్షంలో నితీశ్‌తో ప్రమాణం చేయించారు. బిజెపి నేతలు సామ్రాట్ చౌదరి, మాజీ స్పీకర్ విజయ్‌కుమార్ సిన్హాలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమా ణం చేశారు. వీరికి ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. వీరితో పాటు జెడియు నుంచి విజయ్‌కుమార్ చౌదరి, వీరేంద్రయాదవ్, శ్రవణ్‌కుమార్ , వీరికి తోడుగా మాజీ సిఎం జితన్ రామ్ మాంజీ సారథ్యపు హిందూస్థాన్ అవామ్ మోర్చాకు చెందిన సంతోష్ కుమార్ సుమన్ , ఇండిపెండెంట్ లెజిస్లేటర్ సుమిత్ సింగ్‌లతో కూడా గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.

ఈ విధంగా సిఎం నితీశ్, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కలిపితే ఈ రోజు మంత్రులుగా ప్రమాణం చేసిన వారు మొత్తం మీద ఎనమండుగురు అయ్యారు. బిజెపితో జెడియు కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం, అధికార మార్పిడిలో భాగం గా మంత్రుల నియామక ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలోనే బిజెపికి చెందిన వారు ఇరువురు ఉపముఖ్యమంత్రు లు అయ్యారు. తరువాతి దశలో ఇరు పార్టీలకు చెందిన వారు మరికొందరు మంత్రులు అవుతారని వెల్లడైంది. ఇప్పుడు జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇప్పటివరకూ ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్, అసెంబ్లీ లో ఏకైక అత్యధిక సంఖ్యాబలం ఉన్న ఆర్జేడీ నుంచి ఎవ రూ హాజరుకాలేదు. జెడియు ద్రోహానికి పాల్పడింది. ప్ర జలు ఎన్నికలలో నితీశ్‌కు తగువిధంగా బుద్ధిచెపుతారని తేజస్వీ సామాజిక మాధ్యమంలో స్పందించారు. ఇంతటితో ఆట ముగియలేదు. తమకైతే ఇదిఆట ఆరంభమే అని తేజస్వీ తెలిపారు. అంతకు ముందు తేజస్వీ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ కూతురు , తేజస్వీ అక్క రోహిణి ఆచార్య కూడా నితీశ్‌ను ఫిరాయింపుదార్ల ప్రతీక అని, ఊసరవెల్లి అని విమర్శించారు. మహాఘట్‌బంధన్‌కు వెలుపలి నుంచి మద్దతు ఇస్తూ వచ్చిన సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ కూడా కుమార్‌పై నిప్పులు చెరిగింది. ద్రోహి అని మండిపడింది. ఫేస్‌బుక్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య స్పందించారు. దీర్ఘకాలిక సిఎంను ఇప్పుడు బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కూటమి పావుగా వాడుకొంటోందన్నారు.
ప్రధాని అభినందనలు
ఆదివారం ప్రమాణం స్వీకారం చేసిన సిఎం నితీశ్‌కు , ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ , సిన్హాలకు ప్రధాని మోడీ శుభాభినందనలు తెలిపారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం బీహారీలకు మరింత అంకిత భావంతో సేవలు అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీహార్‌లో కొత్తగా నియుక్తమైన కొత్త ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తుందని ఆశాభావం ప్రకటించారు.
ఆదివారం చకచకా జరిగిన పరిణామాలు
ఉదయం జెడియు ఎమ్మెల్యేలతో నితీశ్ భేటీ . రాజీనామా నిర్ణయం వెల్లడి, ఆ తరువాత పదిగంటల ప్రాంతంలో గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా సమర్పణ. మధ్యాహ్నం 3 తరువాత తిరిగి సిఎంగా ప్రమాణస్వీకారం . మొత్తం సభ్యులు 243. జెడియు సంఖ్యాబలం 44, బిజెపి 78, ఒక్క ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, మాంజీ సారధ్యపు హామ్ పార్టీ సభ్యులు నలుగురు. కాగా ఆర్జేడీ 79 మంది సభ్యులతో ఏకైక అత్యధిక బలమున్న పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులు ఉన్నారు. వామపక్షాలకు సమిష్టిగా 16 మంది సభ్యులు ఉన్నారు. ఈవిధంగా జెడియు రహిత మహాఘట్‌బంధన్‌కు బలం 114 మంది ఎమ్మెల్యేలు. అయితే ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన మెజార్టీ సంఖ్యకు వీరికి ఎనిమిది మంది సభ్యు లు తక్కువగా ఉన్నారు.
ఘట్‌బంధన్‌లో నా పరిస్థితి బాగాలేదు
తనకు మహాఘట్ బంధన్‌లో పడటం లేదని, కాంగ్రెస్ వైఖ రి ఘోరంగా ఉందని, అందుకే రాజీనామాకు దిగానని నితీశ్ తెలిపారు. 18 నెలల క్రితమే నితీశ్ మహా ఘట్‌బంధన్‌లో చేరి సిఎం అయ్యారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు రాజీనామా సమర్పించిన తరువాత నితీశ్ విలేకరులతో మాట్లాడారు. తనతో కలిసి ఇంతకు ముందటివరకూ పనిచేసిన పార్టీలు ఒక్కటైతే తరువాత ఏమవుతుందనేది ఇప్పటికే మీకు తెలిసివచ్చేదన్నారు. దీనిని పసికట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను పదవికి రాజీనామా చేశానని, దీనితో సాంకేతికంగా అధికారికంగా ఇప్పటివరకూ ఉన్న ప్రభుత్వం దశ ముగిసింది. దీని ముగింపు జరగాలని తానే అనుకున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News