అమరావతి: మీ బిడ్డ జగన్ అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అక్కా చెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నామని, అక్కాచెల్లెమ్మల కోసం కాపునేస్తం, ఇబిసి నేస్తం తీసుకొచ్చామని, 31లక్ష ఇళ్ల పట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చామన్నారు. పార్లమెంట్, ఎపి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగన్ నర్సపురంలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామని, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచామని సిఎం జగన్ స్పష్టం చేశారు.
పేదవాడి వైద్యం కోసం రూ.25 లక్షల వరకు ఆరోగ్య శ్రీని విస్తారించామని, పేషెంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించామని, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నామని, నాడు నేడు ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చామని వివరించారు. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం చేశామని, గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని, రూ.2 లక్షల 70 వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశామని, గత ఐదు సంవత్సరాల నుంచి రెండు లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? అని అడిగారు. టిడిపి పాలనలో డ్వాక్రా రుణాలు రద్దు, రైతు రుణమాఫీ చేస్తానన్నాడు… చేశాడా? అని సిఎం జగన్ ధ్వజమెత్తారు. ఎపిలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని, క్లాస్ వార్ అని అభివర్ణించారు. మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంటా? నమ్ముతారా?, వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలని సిఎం జగన్ కోరారు.