Sunday, December 22, 2024

నవంబర్ 1 నుంచి ‘ఎపికి ఎందుకు మళ్ళీ జగన్ కావాలి’ కార్యక్రమం: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఫిబ్ర‌వ‌రిలో పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సోమవారం వైయస్‌ఆర్‌సిపి సమర భేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. వ‌చ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మవుదామ‌ని, రాష్ట్రంలో నాలుగేళ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌లు పేద‌ల‌కు, పెద్ద‌ల‌కు మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మ‌ని, మ‌న ప్ర‌భుత్వంలో జ‌రిగిన మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన పార్టీ మనది అని, మనకు తప్ప దేశంలో ఇంకెవరికీ ఇది సాధ్యం కాలేదని తెలిపారు. రాష్ట్ర వ్యవస్థల్లో, పాలనలో ఇన్ని మార్పులు తెచ్చింది మన ప్రభుత్వం ఒక్కటేనని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో వినూత్న మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.

మన సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోను తెలుగుదేశం ఎలా మాయం చేసింది?, మన ప్రభుత్వం మేనిఫెస్టోను ఎంత సమర్థవంతంగా అమలు చేస్తున్నది అనేది వివరించాలని కార్యకర్తలు తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో అయినా, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో అయినా 50 శాతం ఖచ్చితంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు ఏకంగా చట్టం చేసి మరీ ఇవ్వగలిగాం అని సవినయంగా తెలియజేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల నుండి రాష్ట్ర కేబినెట్ వరకు సామాజిక న్యాయం వర్ధిల్లిన పాలన మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు.

నవంబర్ ఒకటో తేదీ నుంచి ‘ఏపీకి ఎందుకు మళ్ళీ జగన్ కావాలి’ అనే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా సచివాలయాలు మన కార్యకర్తలు సందర్శించాలని, ఆ సచివాలయం పరిధిలో ప్రభుత్వం తరపున మనం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులకు సంబంధించిన బోర్డులను ఆవిష్కరించాలని సిఎం సూచించారు. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకూ మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ఉంటాయని.. ఇందులో ఎమ్మెల్యేలు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు ఉంటారని ఆయన చెప్పారు. మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగసభలు జరుగుతాయని, అందులో ప్రభుత్వం చేసిన సేవలు, మారిన వ్యవస్థలు, కనిపిస్తున్న అభివృద్ధిని గురించి ప్రజలకు వివరిస్తారని సిఎం జగన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News