Monday, December 23, 2024

దశాబ్ది ఉత్సవాల లోపు విఆర్‌ఎలకు రెగ్యులర్ స్కేల్

- Advertisement -
- Advertisement -

దశాబ్ది ఉత్సవాల లోపు విఆర్‌ఎలకు రెగ్యులర్ స్కేల్
బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసం,
చిరుద్యోగులైన విఆర్‌ఎల సమస్యలను మానవత్వంతో
వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
విఆర్‌ఎ జెఎసి ప్రతినిధులతో చర్చించిన సిఎం
విఆర్‌ఎలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ విషయంపై కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్న అనంతరం విఆర్‌ఎ జెఎసి ప్రతినిధులను తన ఛాంబర్‌కు ఆహ్వానించి సిఎం వారితో చర్చించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన విఆర్‌ఎల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సిఎం పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది ఉన్న విఆర్‌ఎలలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు.

మిగతావారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్ (లష్కర్స్), రెవెన్యూ, జెడ్‌పి, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. ఈ విషయంలో విఆర్‌ఎలు సమాచారం ఇవ్వడం సహా, అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని ఎంఎల్‌సి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని, విఆర్‌ఎ జెఎసి ప్రతినిధులకు సూచించారు. విఆర్‌ఎలలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని సిఎం అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు జి.జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి,ఎంఎల్‌సి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, విఆర్‌ఎ జెఎసి ప్రతినిధులు రమేష్ బహదూర్, వెంకటేష్ యాదవ్, మాధవ నాయుడు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.కేబినేట్‌లో నిర్ణయం తీసుకొని తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విఆర్‌ఎ జెఎసి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News