Tuesday, November 5, 2024

కష్టించే రెక్కలకు కానుక

- Advertisement -
- Advertisement -

దేశంలోని దళితులందరికీ విముక్తి ప్రదాత కానున్న దళితబంధు

ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించినందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిన హుజూరాబాద్ దళిత సంఘాల నేతలు, మేధావులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అర్హులైన దళితులందరికీ ఈ పథకం అమలు చేస్తామన్నారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలువనుందన్నారు. అలాగే దేశంలోని దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎస్‌సి కార్పోరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన నేపథ్యంలో సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం పెద్దఎత్తున ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అభినందన కార్యక్రమంలో ఎస్‌సి కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో దళితబంధు విజయవంతం కోసం ప్రతి దళితబిడ్డ పట్టుబట్టి పనిచేయాలన్నారు. ప్రతి దళితవాడలో ఒక కెసిఆర్ పుట్టాలని అని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రైతు బందు సమితి అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బిసి కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, టిఆర్‌ఎస్‌వి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజూరాబాద్ జెడ్‌పిటిసి బక్కారెడ్డి, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, రాష్ట్ర దళిత సంఘాల నేతలు, పలువురు దళిత నాయకులు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యమంలా దళితుల అభివృద్ధి
తెలంగాణ దళితుల అభివృద్ధిని కూడా తెలంగాణ ఉద్యమంలా చేపట్టాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు ఇట్లా 100 ఏండ్ల పాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నారన్నారు. అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక గాడిలో పడిందన్నారు.
దళిత బంధు విజయవంతం చేస్తాం
తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా? అని అనుమానపడ్డరని సిఎం కెసిఆర్ అన్నారు. కానీ మొక్కవోనీ దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. అలాగే ఇరువైనాలుగు గంటలు కరెంటు సరఫరా అయ్యేదా పొయ్యేదా? అని అనేక సంహాలు వ్యక్తం చేశారన్నారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు సైతం ఇది అయితదా అని ప్రశ్నించారన్నారు. కానీ సకాలంలో ప్రాజెక్టు పూర్తి అయిందని సిఎం తెలిపారు. దండుగన్న వ్యవసాయం ఇప్పుడు పండుగైందన్నారు. రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచిన్రు అని, ఇవ్వాల రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నడన్నారు. అట్లనే దళిత బంధును కూడా కొందరు అనుమాన పడుతున్నారని, వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తామన్నారు. అదే స్పూర్తితో దళిత బంధును అమలు చేస్తం. విజయం సాధిస్తామని’ అని సిఎం స్పష్టం చేశారు.

సమాజాభివృద్ధికి దారులు వేయాలి
దళిత బంధును విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర సమాజానికే కాదు దేశ దళిత సమాజాభివృద్ధికి హుజూరాబాద్ దళితులు దారులు వేయాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. అందుకు పునాది వేద్దామా? అని సభికులతో సిఎం ప్రతిజ్జ తీసుకున్నారు. తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకు పోయిన పులి పిల్లలాంటి వాల్లనే సంగతిని, స్వయంపాలన ఏర్పాటయినంక ప్రపంచం పసిగట్టిందని సిఎం వివరించారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్దిని చూసి దేశం నివ్వెర పోతున్నదన్నారు. రాష్ట్ర రైతాంగం రోహిణీ కార్తెలోనే నాట్లేసుకునే రోజులొచ్చినయన్నారు. ఇంకా సమాజంలో వరకట్నం అంటరానితనం వంటి పలు వివక్షలు పీడిస్తున్నాయని వాటిని విద్యాభివృద్ధి, ఆర్ధికాభివృద్ది ద్వారా సాధించవచ్చునన్నారు. వృద్దులు, వంటరి మహిళలు, వికలాంగులు తదితర అభాగ్యులకు ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని, వారి కండ్లల్లో సంతోషం కనిపిస్తున్నదన్నారు. అదే రీతిలో దళిత సమాజం మోములో ఆనందాన్ని చూడాలనేదే తన పట్టుదల అని సిఎం పునరుద్ఘాటించారు.

ఆయన నెత్తిన బండ పెట్టిన
టిఆర్‌ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఎంతో క్రమశిక్షణతో నిబద్దతతో పనిచేసుకుంటూ వస్తున్న బండ శ్రీనివాస్ కు తాను పదవిని మాత్రమే ఇవ్వలేదనీ, తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ది చేసే క్రమంలో ఆయన నెత్తిన పెద్ద బాధ్యతతో కూడిన ‘బండ’ ను పెట్టానని సిఎం వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా పెద్దఎత్తున నవ్వులు విరిసాయి.

ఆర్ధిక సాయం పూర్తిగా ఉచితం
ఇన్నాళ్లూ ఏవేవో పథకాలు తెచ్చి బ్యాంకుల గ్యారెంటీ అడిగినయి ప్రభుత్వాలు.. కాల్లు చేతులే ఆస్తులుగా వున్న కడుపేద దళితులు గ్యారెంటీలు ఎక్కడ తెస్తరని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం పూర్తి ఉచితమని స్పష్టం చేశారు. ఇది అప్పుకాదన్నారు. తిరిగి ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో దళారుల మాటే ఉండదని సిఎం కెసిఆర్ తెలిపారు. నేరుగా అర్హులైన లబ్దిదారుల బ్యాంకులో ఆర్థిక సాయం వచ్చి చేరుతుందని అని సిఎం స్పష్టం చేశారు.

పైసలు పప్పులు, పుట్టాలకు ఖర్చు చేయవద్దు
దళితుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి వారిలో ధీమా పెరిగి తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోగలం అనే భరోసాను కలిగించే ప్రయత్నమే దళిత బంధు పథకమని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇచ్చిన పైసలు పప్పులు పుట్నాలకు ఖర్చు చేయకుండా, పైసను పెట్టి పైసను సంపాదించే ఉపాధి వ్యాపార మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఆర్ధికంగా అభివృద్ది చెందాలన్నారు. అందుకు మీరందరూ కృషి చేయాలని అని సిఎం సభికులనేద్దేశించి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాల నిర్లక్షం
స్వాతంత్య్రం వచ్చిన నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బహుజన వర్గాల బాగు కోసం కొట్లాడిండని సిఎం తెలిపారు. ఆ తర్వాతి కాలంలో బడుగుల బాగును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. గాంధీజీ, అంబేద్కర్ లు వేసిన బాటలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని, వారి ఆశయాలను కొనసాగించి దళితుల అభివృద్దిని సాధించి చూపెడుతామని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రారంభించిన అనేక పథకాలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. అలాగే దళిత బంధు పథకాన్ని కూడా దేశానికి ఆదర్శంగా మారుతుందన్నారు. ఎక్కడో వొక దగ్గర ప్రేరణ కావాలని… అది హుజూరాబాద్ అవుతున్నందుకు ఆ గడ్డమీది బిడ్డలుగా మీరందరూ గర్వపడాలసని అని సిఎం స్పష్టం చేశారు.

దళిత వాడలు ఫరిడవిల్లాలె
మంచి జరిగి వెలుతురొస్తే ఈ వెలుతురు అణగారిన దళిత వర్గాలందరికీ మేలు జరిగి ఒక తొవ్వ పడుతుందని సిఎం వ్యాఖ్యానించారు. ఇది హుజూరాబాద్ దళిత నాయకుల పట్టుదల, నిబద్దత, చిత్తశుద్ది మీద ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా దళిత బంధును అమలు చేసుకుందామన్నారు. అందరూ కలిసిమెలిసి అన్నాదమ్ముల వలె ఉండాలన్నారు. చిరునవ్వులతో పరస్పరం పలకరించుకోవాలని సూచించారు. కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు లేని వాడలుగా, దళిత వాడలు ఫరిడవిల్లాలని అని సిఎం ఆకాంక్షించారు. ఒకరి మీద ఒకరు పెట్టుకున్న కేసులను ఎత్తేసుకోవాలని సూచించారు. ఒకరు ఏమాత్రం కింద పడే పరిస్థితి అనిపించినా వెంటనే ఆదుకొనే ఖోజా జాతి మనందరికీ ఆదర్శం కావాలన్నారు. దళిత జాతిలో ఇక ఎవ్వరూ పేదలుగా మిగలకూడని సిఎం స్పష్టం చేశారు. ఈ దళిత బంధు పథకం, కేవలం పథకం మాత్రమే కాదని, తెలంగాణ ఉద్యమం మాదిరి దళితుల అభ్యున్నతి కోసం సాగే ఉద్యమం అని పునరుద్ఘాటించారు. ఒక దీపం ఇంకోదీపాన్ని వెలిగించినట్టు వొకరి అభివృద్ధికోసం వొకరు పాటు పడే యజ్జం అని సిఎం తెలిపారు.

CM KCR Appoints Banda Srinivas as SC Corporation Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News