హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 24వ తేదీన సాయంత్రం బేగంపేట్‌లోని విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో సిఎం కెసిఆర్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. 25వ తేదీన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిశారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలపై చర్చించారు.
కేంద్రం కొత్తగా విడుదల చేసిన కృష్ణా, గోదావరి గెజిట్ నోటిఫికేషన్‌లపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకం, పక్క రాష్ట్రం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని సిఎం కోరిన విషయం తెలిసిందే. కాగా 26వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోల ప్రభావిత రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. 27వ తేదీన కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, ప్రజా పంపిణిల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న దొడ్డు బియ్యం సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ఇలా వివిధ అంశాలపై కేంద్రమంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.