పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా అదనంగా 56 మందిని ఇవ్వాలి
వారి సంఖ్యను ప్రస్తుతం ఉన్న 139 నుంచి 195 చేయాలి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి గతంలో గల 10 జిల్లాలను 33కు పెంచాం, ఆ మేరకు పోలీసు
కమిషనరేట్లు పెరిగాయి గతంలో 9 పోలీసు కార్యాలయాలు, 2 కమిషనరేట్లు ఉండేవి, ఇప్పుడు 20 జిల్లా పోలీసు
కార్యాలయాలు, 9 కమిషనరేట్లు అయ్యాయి ఈ మేరకు ఐపిఎస్‌ల సంఖ్యను పెంచాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు తెలంగాణకు ఐపిఎస్ అధికారుల సంఖ్యను 139 నుంచి 195కు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ శనివారం మధ్యాహ్నం అమిత్‌షాను కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఐపిఎస్‌ల కేటాయింపుతో పాటు మరికొన్ని అంశాలను విన్నవించారు. రాష్ట్రంలో పాలన సౌలభ్యం కోసం గతంలో ఉన్న జిల్లాలను 10 నుంచి 33కు పెంచిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా అమిత్‌షా దృష్టికి మరోసారి సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలతో పాటు పోలీస్ కమిషనరేట్లు పెరిగాయని వివరించారు. అందుకు అనుగుణంగా ఐపిఎస్‌ల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు అనుగుణంగా ఐపిఎస్ క్యాడర్‌పై సమీక్ష చేయాలని కోరుతూ అమిత్‌షాకు ఒక వినతిపత్రం అందించారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవన్నారు. ప్రస్తుతం జిల్లాల విభజన జరిగినన నేపథ్యంలో కొత్త 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దీనికి అనుగుమంగా ఐపిఎస్‌ల సంఖ్యను పెంచాలని కోరారు. 2016లోనే ఐపిఎస్ క్యాడర్ సమీక్ష జరిగిందన్నారు. 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపిఎస్ పోస్టులను కేంద్ర హోంశాఖ ఆమోదించిందన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పాటవడంతో కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తంగా 195ఐపిఎస్ పోస్టులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రికి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కేడర్ బలాన్ని సాధారణంగా అనుమతి ఇచ్చే 5శాతం పెంపునకు పరిమితం చేయకుండా 40శాతం మేర పెంచాలని కోరారు.
అలాగే తెలంగాణ పోలీస్ కేడర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. ఐపిఎస్ కేడర్ పోస్టుల కేటాయింపులు జరిపితే ఐపిఎస్ అధికారులను కమిషనర్లు, ఎస్‌పిలు, జోనల్ డిఐజి, మల్టీజోనల్ ఐజిపిలుగా నియమించడానికి వీలవుతుందని అమిత్ షాకు ఇచ్చిన లేఖలో సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపిఎస్ కేడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించి ఆమోదముద్ర వేయాలన్నారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర నిధులు సమకూర్చాలని
విజ్ఞప్తి చేశారు.
బిజిబిజిగా కెసిఆర్
మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి బయలు దేరిన సిఎం కెసిఆర్ శనివారం నాటితో నాలుగవ రోజుకు చేరింది. ఈ నెల ఒకటవ తేదీన హస్తినాకు ఆయన వెళ్లారు. రెండవ తేదీన టిఆర్‌ఎస్ భవన్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. మూడవ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో తన పర్యటనను పొడిగించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో సమావేశమైన సిఎం కెసిఆర్ శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై చర్చించారు. కాగా ఆదివారం కూడా ఢిల్లీలోనే మకాం వేసి మరికొంత మంది కేంద్రమంత్రులతో సిఎం కెసిఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రషెకావత్‌ను కలిసి చర్చించనున్నట్లుగా సమాచారం. అవకాశం లభిస్తే మరికొంత మంది కేంద్రమంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.