తెలంగాణ రాష్ట్ర ప్రదాత సిఎం కెసిఆర్ జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించుకుందాం
ఈ సారి మూడు రోజుల పాటు కెసిఆర్ జన్మదిన సంబరాలు
15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ పిలుపు
హైదరాబాద్: 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కెసిఆర్ జన్మదిన వేడుకలను ఈ సారి మూడు రోజుల పాటు ఒక సంబరంగా జరుపుకుందామని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల ఈ సంబరాలు ఉండాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
ఈ మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు:
ఈ నెల 15 వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. 16వ తేదీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. 17వ తేదీ కెసిఆర్ జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కెటిఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.