రాష్ట్రాలు విదేశాలకు అమ్మే
అవకాశాలను గుర్తించాలి
కేంద్రమంత్రి పీయూష్
గోయల్‌ను కలిసి విజ్ఞప్తి
చేసిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా బాయిల్డ్ రైస్ సేకరణ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డుబియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మరోసారి ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అయితే దొడ్డు బియ్యం కొనుగోలు అసాధ్యమని, ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాలు సొంతంగా విదేశీ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉందా? అలాంటి వెసలుబాటు ఏదైనా ఉందా? అన్న విషయాన్ని గుర్తించాలని కేంద్రమంత్రిని కోరారు.
అనంతరం కేంద్రమంత్రితో జరిగిన సమావేశం వివరాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఢిల్లీలో వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై ప్రధానంగా చర్చించామన్నారు. గతంలో మాదిరిగా కొనలేమని కేంద్రం రాతపూర్వకంగా రాష్ట్రానికి తెలిపిందన్నారు. కేంద్ర గోదాముల్లో నాలుగేళ్లకు సరిపోయే నిల్వ ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారని పేర్కొన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. మరో రెండు మూడు రోజుల సమయం కావాలని కేంద్ర మంత్రి కోరారని ఆయన తెలిపారు. ఈ సమస్యకు కేంద్రం ఏ పరిష్కారం చెబుతుంది అని ఎదురుచూస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిఎం కెసిఆర్ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. గత ఏడేండ్లుగా గోదావరి, కృష్టా నదులపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం పర్యావరణ, జల్ శక్తిశాఖ వద్దకు తిరిగి కెసిఆర్ అనుమతులు సాధించారన్నారు. ప్రాజెక్టులు నిర్మాణం తర్వాత సాగునీటికి నిరంతరం విద్యుత్ సౌకర్యం కల్పించారన్నారు. రైతు బంధు వంటి చర్యలతో రాష్ట్ర రైతాంగం గర్వంగా, ధైర్యంగా సాగు చేయడంతో పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా గర్వపడుతున్నామన్నారు. పార్లమెంట్‌లో పలు సందర్భాల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు ప్రస్తావించినప్పుడు, రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు, అధికారులు ఈ అంశాన్ని ఒప్పుకోక తప్ప లేదని ఈ సందర్భంగా వినోద్‌కుమార్ గుర్తు చేశారు.
రాష్ట్రంలో పండించిన పంట గత కొవిడ్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వమే కొన్నదన్నారు.దేశంలో రైతులు పండించిన పంటను కొన్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని అన్నారు. ఖరీఫ్, రబీలో పండించే పంటను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రం సేకరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సిఐ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని టిఆర్‌ఎస్ ఎంపిలు, మంత్రులు కోరడం జరిగిందన్నారు. కాని దురదృష్టవశాత్తు ధాన్యం సేకరణ చేయలేమని ఎఫ్‌సిఐ లిఖితపూర్వకంగా లేఖలు రాయడం మొదలు పెట్టిందన్నారు. ఇదే అంశంపై గత రెండు రోజుల నుంచి సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడం జరిగిందన్నారు. అయితే పంటల మార్పిడి జరగాలని పియూష్ గోయల్ చెప్పారన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు వరిపంటను పండిస్తున్నాయన్నారు. చివరకు గోధులు పండించే పంజాబ్ కూడా ఒక పంటగా వరిని పండిస్తున్నాదన్నారు. అందువల్ల గోడౌన్లు అన్ని వరితో నాలుగేళ్లకు సరిపడ నిలువలు పేరుకపోయాయని సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రి వివరించారు. దీనిపై కేంద్ర, రాష్ట్రాలు నిందలు వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నీళ్లకు నోచుకోలేదని, అందువల్లే అప్పట్లో సరైన పంటలు పండలేదని వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో నీళ్లను చూసి జనాలు మురుస్తున్నారన్నారు. అందుకే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో శాసనసభ జరుగుతున్నా సిఎం కెసిఆర్ ఢిల్లీలోనే ఉండి రెండు సార్లు కేంద్రమంత్రిని కలిసి సమస్యకు పరిష్కారం కోసం చూస్తున్నారని వినోద్‌కుమార్ వివరించారు. ఎఫ్‌సిఐ ఎంత సేకరిస్తున్న విషయాన్ని సిఎం కెసిఆర్ రైతులకు చెప్పాలని భావిస్తున్నారన్నారు. అలాగే వరిని విదేశాలకు అమ్మె అవకాశం ఉందా? అన్న అంశంపై కూడా రెండు రోజుల క్రితం సంబంధిత అధికారులతో సిఎం కెసిఆర్ సుదీర్ఘంగా చర్చించారన్నారు.