Sunday, January 19, 2025

ప్రచారంలో దూకుడు

- Advertisement -
- Advertisement -

మన : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ దూసుకుపోతుంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పార్టీ అభ్యర్థులకు ఇప్పటికే బి.ఫాంలు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారాల జోరు పెంచారు. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ.. మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాదసభలతో జనంలోకి వెళ్తుంటే.. అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాలలో మండలాలు, గ్రామస్థాయి నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోతూ బిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బిజెపి సహా ఇతర రాజకీయ పార్టీలు కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉండగా, ప్రతిపక్షాలు ఒకడుగు వేసేలోపే బిఆర్‌ఎస్ వంద అడుగులు వేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడం, మేనిఫెస్టో విడుదల చేయకపోవడంతో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా గులాబీపార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నాయి.

నేటి నుంచి మళ్లీ ప్రజల్లోకి సిఎం కెసిఆర్
బిఆర్‌ఎస్ పార్టీ అధినే,ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొద్ది విరామం తర్వాత గురువారం (అక్టోబర్ 26) నుంచి రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.దసరా పండుగ దృష్ట్యా సిఎం కెసిఆర్ బహిరంగ సభలకు కొంత విరామం ఇవ్వగా, గురువారం నుంచి మళ్లీ ఎన్నికల సన్నాహకాలపై దృష్టి సారించారు. ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతూ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్న పార్టీ అభ్యర్థులతో సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఓటరు అవగాహన సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో ఆయన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకోగా,

మిగిలిన పర్యటనలో ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగనుంది. సిఎం కెసిఆర్ పర్యటనలో జరిగిన స్వల్ప మార్పుల ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సిఎం కెసిఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 26వ తేదీన అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో సభలు జరగాల్సి ఉంది. కానీ నాగర్‌కర్నూలులో జరగాల్సిన సభను వనపర్తికి మార్చారు. అలాగే ఈ నెల 27వ తేదీన పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించాల్సి ఉండగా.. కొత్త షెడ్యూల్ ప్రకారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటకు సభలను మార్చారు.

అధినేత సభలతో ఊపందుకున్న ప్రచారం
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభలతో బిఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం మరింత ఊపందుకుంది. అభ్యర్థుల మొదటి దశ ప్రచారపర్వం ఇప్పటికే ముగియగా, అధినేత పాల్గొంటున్న సభలతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఓ వైపు మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు దాదాపు అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి, పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండగా, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోవైపు అభ్యర్థులు వారి నియోజకవర్గాలలో ఇప్పటికే మొదటి విడత ప్రచారం పూర్తి చేయగా, రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 15 నుంచి గులాబీ దళపతి రంగంలోకి దిగడంతో పార్టీ కేడర్ కొత్త ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తోంది.

హ్యాట్రిక్‌కు అన్ని విధాలా సమాయత్తం
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి విజయఢంకా మోగించేందుకు అధికార బిఆర్‌ఎస్ అన్నిరకాలుగా బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. తాజాగా సబ్బండ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతేకాక ఇప్పటికే రెండు మూడు స్థానాలు మినహా అభ్యర్థులందరికీ బి.ఫాంలు అందజేశారు. దీంతో పార్టీ శ్రేణులు మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో ప్రచారజోరుకు శ్రీకారం చుట్టారు. మరోసారి విజయకేతనం ఎగురవేసేందుుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. ఈసారి మళ్లీ బిఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తూ నియోజకవర్గాలలో ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై విపక్ష కాంగ్రెస్, బిజెపిలు అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని బిఆర్‌ఎస్ అభ్యర్థులు విమర్శిస్తున్నారు. పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజల కళ్లముందే ఉందని…అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే బిఆర్‌ఎస్ పార్టీని మరోసారి గెలిపించుకోవాలని కోరుతున్నారు. కరవు, వలసలతో అల్లాడిన తెలంగాణ జిల్లాలు సాగు, తాగునీళ్ల కష్టాలు తీర్చడం ప్రభుత్వ విజయమని పేర్కొంటున్నారు. మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారని, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సిఎం కెసిఆర్ అమలు చేయగలిగే మేనిఫెస్టోను ప్రకటించారని చెబుతున్నారు.

సిఎం కెసిఆర్ ప్రచార షెడ్యూల్
అక్టోబర్ 26 అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్ 27 పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట
అక్టోబర్ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్ 30 జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్
అక్టోబర్ 31 హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్ 01 సత్తుపల్లి, ఇల్లందు
నవంబర్ 02 నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
నవంబర్ 03 భైంసా(ముధోల్), ఆర్మూర్, కోరుట్ల
నవంబర్ 05 కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్ 06 గద్వాల్, మక్తల్, నారాయణపేట
నవంబర్ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్ 08 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News