ఖమ్మం: తెలంగాణ ఇస్తే.. ఎలా బతుకుతారు.. అని ఎపి నేతలు మాట్లాడారని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ కటిక చీకటి అవుతుందని ఆనాటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని కెసిఆర్ గుర్తుచేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎపి, తెలంగాణ రోడ్లను పరిశీలించాలని ఆయన కోరారు. ఎపిలో రోడ్లు ఎలా ఉన్నాయో.. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. డబుల్ రోడ్డు వేస్తే తెలంగాణ.. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అని కెసిఆర్ తెలిపారు. సరిహద్దుల్లోని ఎపి ప్రజలు ఇప్పుడు తెలంగాణకు వచ్చి వరి ధాన్యం అమ్ముకుంటున్నారు.
తెలంగాణలో ధాన్యం డబ్బులు వెంటనే వస్తాయని ఇక్కడకు వచ్చి అమ్ముతున్నారని తెలిపారు. ఇవాళ తెలంగాణలో విద్యుత్ వెలుగు జిలుగులు ఉన్నాయని తెలిపారు. మనకు శాపం పెట్టిన వాళ్లే ఇప్పుడు చీకట్లో ఉన్నారన్నారు. ప్రధాని మోడీకి ప్రైవేటీకరణ అనే పిచ్చిపట్టుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థలను ప్రవేటుపరం చేశారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో భారాస ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.