మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉన్నట్టు తెలుస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఇలాగే జరిగిందన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాలపై క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్టు సమాచారం వస్తోందన్నారు. అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయన్నారు. దీనిపై కేంద్రం విచారణ జరిపించాలన్నారు. ఆదివారం భద్రాచలంలో ముంపు ప్రాంతాలతో ప్రజలతో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారన్నారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చిందని….. దీని వెనుక ఏవో కుట్రలున్నాయన్నట్టు చెబుతున్నారన్నారు. అయితే ఇవి ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదన్నారు. ఇతర దేశాల వాళ్లు కావాలనే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో జమ్మూ, కశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఇలాగే చేశారన్నారు. ఇటీవల గోదావరి పరీవాహక ప్రాంతంపై అలా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుంటుందన్నారు. కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకుంటామన్నారు. అవసరమైతే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మూడు షిఫ్టుల వారిగా అధికారులు విధులు అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఆపదలో ఉన్నారని.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరింత జాగ్రత్తగా ఉంటామని….ముందస్తూ చర్యలను శరవేగంగా చేపడతామన్నారు.
CM KCR Comments on Buster Cloud