హైదరాబాద్: ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సూచించారు. అభ్యర్థులు ఎలాంటి వాళ్లో ఆలోచించి ఓటు వేయాలని, అభ్యర్థులనే కాదు వాళ్ల వెనకున్న పార్టీలను కూడా చూడాలని తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రజా ఆశ్వీరాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. ప్రజలు పరిణితితో ఆలోచించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని, ప్రజాస్వామ్యంలో పరిణితి పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
బిఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి అని స్పష్టం చేశారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ నాశనం చేసిందని, తెలంగాణ ఇస్తామంటూ అనేకసార్లు మాట తప్పారని కెసిఆర్ దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అమరణ దీక్షకు దిగితే అప్పుడు కాంగ్రెసోళ్లు ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లు 1940 వద్దే ఆగిపోయారని, ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ కష్టాలే ఉండేవని చురకలంటించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే ఎక్కువగా వినిపించేవన్నారు. ఇప్పుడు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారన్నారు.