హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావ జాలవ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి ( జూన్ 21) సందర్భంగా సిఎం కెసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం వారు చేసిన కృషి అజరామరమైనది అని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జయశంకర్ ఆకాంక్షించిన మహోజ్వల తెలంగాణను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజం ఆవిష్కరించుకుంటున్నదనీ పేర్కొంటూ ఇది గర్వించదగ్గ సందర్భం అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
ఇటువంటి చారిత్రక సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ వుండి వుంటే ఎంతో సంతోషించే వారనీ, వారు లేకపోవడం బాధాకరమనీ సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిలో నిత్యం ప్రతిబింబిస్తూనే ఉంటుందని అన్నారు. తెలంగాణ అమరుల స్ఫూర్తితో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.