స్పౌజ్ కేసులు సహా వివిధ అప్పీళ్ల పరిశీలన ముమ్మరం
న్యాయమైన విజ్ఞప్తుల గుర్తింపు, సానుకూల నిర్ణయం
ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి
సిఎం ఆమోదంతో మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్
పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రక్రియ పూర్తి
ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశనం
హైదరాబాద్: ఉద్యోగుల స్పౌజ్ కేసులతో సహా వివిధ అప్పీళ్ల పరిశీలన కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో కసరత్తు పూర్తై, ప్రభుత్వం వాటిని పరిష్కరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల పరస్పర బదిలీలకు కూడా అనుమతిచ్చే దిశగా నిర్ణయం వెలువడనుంది.
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో పూర్తి కానుంది. జిల్లాస్థాయి ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తయ్యింది. జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల అలొకేషన్ ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకొంది. ప్రస్తుతం ఉద్యోగుల స్పౌజ్ కేసుల పరిష్కారంతోపాటు అప్పీళ్ల పరిశీలన కొనసాగుతోంది. వివిధ శాఖల అధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు అందిన దరఖాస్తులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విజ్ఞప్తుల విశ్వసనీయత, ఆవశ్యకతల ఆధారంగా వాటిని ఏ మేరకు పరిగణలోకి తీసుకోవచ్చన్న విషయమై అధికారులు దృష్టిసారించారు.
స్పౌజ్ కేసులతో సహా అన్ని అప్పీళ్లపై సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాటి పరిష్కారం కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలకు లోబడి కొన్ని అప్పీళ్లు న్యాయమైనవిగా గుర్తించినట్లు సమాచారం. మిగతా దరఖాస్తులను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని భావిస్తున్నారు. అటు పరస్పర బదిలీలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పైరవీలకు, అక్రమదందాలకు ఆస్కారం ఇవ్వకుండా మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కు అనుమతి ఇచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరవాత ఆ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
మెట్టుపల్లి శ్రీనివాస్ సర్