హైదరాబాద్: నాగార్జున సాగర్ దివంగత ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సంతాప తీర్మానాన్ని సిఎం కెసిఆర్ ప్రతిపాదించారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే నోముల నర్సింహయ్య ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో హుందాగా ఎలా వ్యవహరించాలో తెలిసిన వ్యక్తి నోముల అని పొగిడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటి కోసం పోరాడిన వ్యక్తి నోముల అని ప్రశంసించారు. నేటి తరం నోముల నర్సింహయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తన చివరి శ్వాస వరకు పేదల కోసం పాటుపడిన వ్యక్తి అని, తెలంగాణ అభివృద్ధి కోసం నోముల తనతో ఆలోచనల్ని పంచుకున్నారని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో నోముల చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పుడు కూడా నోముల తెలంగాణ కోసం తపించేవారన్నారు.