మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో ’రెబల్ స్టార్’గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సిఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎం ఆదేశించారు. ఈ మేరకు సిఎస్ సోమేశ్ కుమార్ తగు ఏర్పాట్లు చేశారు.
పలువురి సంతాపం
కృష్ణంరాజు మృతిపట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సి కవిత తదితరులు ఉన్నారు.
CM KCR Condoles demise of Krishnam Raju