హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. సోలిపేట రామచంద్రారెడ్డి జీవితం ఆదర్శవంతమైనదని, ఆయన మరణంతో తెలంగాణ తొలి తరం ప్రజానేతను కోల్పోయిందని సిఎం కెసిఆర్ అన్నారు. సోలిపేట కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన ఆయన.. సర్పంచ్ నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు 70 ఏళ్ల పాటు రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
Also Read: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు పంపుతారా?