Monday, December 23, 2024

మంచి చేసిండు: మళ్లీ వస్తాడు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఏ అమ్మ, అక్క, అవ్వ, తాత నోట విన్నా తెలంగాణ అభివృద్ధికై కెసిఆర్ నిరంతరం పని చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో లబ్ధిదారు లు తమ మాటలతోనే సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమం నుంచి నేటి వరకు పేదల పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్నది. పుట్టిన పసి బిడ్డ నుండి పండు ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికీ కుల, మతాలకు అతీతంగా సబండ వర్గాల అభ్యున్నతికై కృషి చేస్తూ తెలంగాణ ప్రజల సుఖసంతోషాలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో అన్ని మతాల వారు కలిసి మెలిసి స్నేహ భావంతో జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్రం దాని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఉద్యమంలో ఎందరో విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగమైనారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో 64 సీట్లతో సంపూర్ణ మెజార్టీ సాధించి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా ఒడిదుడుకులు అధిగమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్ల్లో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు తీసుకుపోవడం జరిగింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం కరెంట్ కోతలతో అంధకారంలోకి పోతుందని భయపేడుతూ, మీకు పరిపాలన చేయడం సాధ్యం కాదని అవహేళన చేసిన సందర్భాలు చూశాము.సందేహాలను, అపోహలను ఛేదిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పరిపాలనలో మార్పులు తీసుకు వస్తూ ప్రజా శ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకు వచ్చి విజయవంతగా లబ్ధిదారులకు అందిస్తూ పేదల ఇండ్లలో పెద్ద కొడుకు అయిండు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బిఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను అమలు చేయాలని అధ్యయనం చేసిన సందర్భాలూ చూశాము. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు మద్దతు పలుకలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అభివృద్ధిపై మాట్లాడిందిలేదు. ఎందుకంటే వారికి కావాల్సింది అభివృద్ధి కాదు, అధికారం కావాలి. 2018 సాధారణ ఎన్నికలలో కెసిఆర్‌ని ఓడించడానికి అన్ని పార్టీలు జట్టు కట్టి పోటీ చేయడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ కుమ్ములాటలు ఏదని తెలంగాణ ప్రజానీకం బిఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో 88 సీట్లతో ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌పై పూర్తి విశ్వాసంతో రెండు పర్యాయాలు అధికారం ఇవ్వడం జరిగింది.

ప్రజల విశ్వాసం మేరకు తెలంగాణ రాష్ట్రాని భారత దేశానికే దిక్సూచీగా నిలపాలని రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు అందుబాటులో వుండే విధంగా నిరంతరం వారిని అప్రమత్తం చేస్తూ ప్రజా శ్రేయసుకు బాటలు వేస్తూ రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ చేస్తూ ఆనాడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి జీవ నదులు ప్రవహిస్తున్నా సాగు నీరు అందలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను తక్కువ సమయంలో నిర్మించి ప్రతి ఎకరానికీ సాగు నీటిని అందింస్తున్న ఘనత కెసిఆర్‌కు దక్కుతుంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కెసిఆర్ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని అన్ని విధాలుగా కృషి చేస్తూ యువతకు ఐటి హబ్ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పేద విద్యార్థుల విదేశీ విద్యకై ఆర్థిక సహాయం అందిస్తూ విద్యార్థులకు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది వివిధ సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతున్నది. ఉన్నత విద్యకై యూనివర్శిటీలను బలోపేతం చేస్తూ,

ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి సంపూర్ణ ఆరోగ్యానికై బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి మన ఊరు మన బడి ద్వారా పాఠశాలలకు నూతన హంగులతో రూపుదీద్దుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు రావడం జరిగింది. పేదల ఆరోగ్యానికై నిమ్స్, గాంధీ, నిలోఫర్, ఉస్మానియా వంటి ఆస్పత్రులలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ శస్త్రచికిత్సలు చేస్తూ నిరుపేదలకు సిఎం సహాయనిధి, ఎల్‌ఒసి వంటి ద్వారా ఆర్థిక భారం కాకుండా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నది. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలు మరువలేనిది. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైంది బిఆర్‌ఎస్. తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో రోడ్లు, ఫ్లై ఓవర్ నిర్మించి కెటిఆర్ ప్రత్యేక దృష్టితో హైదరాబాద్‌ను సింగపూర్ సీటిగా తీర్చిదిద్దారని ప్రముఖులు అభినందించిన సందర్భాలున్నాయి. నేడు తెలంగాణ అభివృద్ధిని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రశంసించి తెలంగాణ సంక్షేమ పథకాలు ఆయ రాష్ట్రాలలో అమలు చేయడానికి ప్రత్యేక బృందాలతో అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వివిధ అవార్డులు,

రివార్డులలో తెలంగాణ ఖ్యాతి దేశం నలు మూలలా వినిపించింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రముఖ ఐటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణకు వస్తున్నాయి అంటే దానికి కెటిఆర్ చొరవ ఎంతో ఉంది. తెలంగాణ పది ఏళ్లకాలంలో చిరు వ్యాపారులు, సామాన్యులు ఏ అల్లర్లు లేకుండా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలతో హైదరాబాద్ ప్రాంత మధ్య తరగతి, సామాన్యమైన ప్రజలు ఆర్థికంగా చితికిపోయేవారు. ఆనాటి ఈనాటి పరిస్థితులపై ప్రజలకు అవగాహన వుంది. కాబట్టి మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీనే కోరుకుంటున్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్సూచీగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రజలు పంట చేలలో, రచ్చబండల, టీ కొట్టుల దగ్గరా ఎటుచూసిన తెలంగాణ ప్రగతి, ఎవ్వరి నోట విన్న కెసిఆర్ మాటనే వినబడుతున్నది. తెలంగాణ ప్రజలందరూ మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News