Wednesday, January 22, 2025

ఆ మూడు నియోజకవర్గాలు కీలకం..!!

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట,ఆంథోల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. గజ్వేల్‌లో సిఎం కెసిఆర్ వరుసగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఉద్యమ నాయకునిగా 2014లో తొలిసారిగా గజ్వేల్‌లో ఆయన బరిలోకి దిగారు. ఘన విజయం సాధించి తెలంగాణా తొలి సిఎంగా చరిత్రలోకెక్కారు. అనంతరం 2018లో మరోసారి భారీ మెజార్టీతో గెలిచి సిఎంగా కొనసాగుతున్నారు. ముచ్చటగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా బిజెపి నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. గతంలో కెసిఆర్ సహచరునిగా ఉన్న ఈటల బిజెపి నేతగా మారిన తర్వాత అటు హుజూరాబాద్ నుంచి, ఇటు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వ్యూహాత్మకంగానే బిజెపి నాయకత్వం ఈటలను బరిలోకి దింపింది. బిసి సిఎం నినాదం నేపథ్యంలో రాష్ట్ర బిజెపి శ్రేణులు, విశ్లేషకులకు గజ్వేల్ ఎన్నిక ఆసక్తిని కలిగిస్తోంది.

ఇక గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న నర్సారెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. కెసిఆర్ పోటీ చేస్తున్న స్థానం కావడం, ఆయన్ని ఢీకొట్టేందుకు ఈటల రాజేందర్ రంగంలోకి దిగడంతో ఈ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ఇక సిద్దిపేటలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇంతింతై వటుడింతై..అన్నట్టుగా ఎదిగిన హరీశ్‌రావు రంగలో ఉండడంతో సిద్దిపేట ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గత 19 సంవత్సరాలుగా హరీశ్‌రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పూజల హరికృష్ణ, బిజెపి నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఆంథోల్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ రాజనర్సింహ బరిలోకి దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన రాజనర్సింహ 2014లో మాజీ మంత్రి బాబూమోహన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కాగా, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మాజీ జర్నలిస్టు చంటి క్రాంతికిరణ్ చేతిలో కూడా ఓడిపోయారు.

దీంతో రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తనకివే చివరి ఎన్నికలని ఆయన చెబుతున్నారు. ఈసారి కూడా బిఆర్‌ఎస్ నుంచి క్రాంతికిరణ్ బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరి మధ్య నువ్వా? నేనా ? అన్నట్టుగా పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ టిక్కెట్ రాకపోవడంతో బిజెపి నుంచి బరిలోకి దిగిన బాబూమోహన్ ఈ సారి అదే పార్టీ నుంచి పోటీచేస్తున్నారు. ఈ విధంగా 2018లో ఇక్కడ ఎవరైతే పోటీ పడ్డారో ఈ దఫా కూడా వారే రంగంలోకి దిగుతున్నారు, సీనియర్ నాయకుడైన రాజనర్సింహకు, యువకుడైన క్రాంతికిరణ్‌కు మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట, ఆంథోల్ అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ ఆసక్తి కరంగా మారింది.పదునైన వ్యూహాలతో నేతలంతా ఎన్నికల గోదాలోకి దిగు తున్నారు. నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. ఇక మిగిలిందల్లా ప్రచార పర్వమే.ఆ తర్వాత పోల్ మేనేజ్ మెంట్ కూడా ప్రధానమైనదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News