Sunday, December 22, 2024

యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ

- Advertisement -
- Advertisement -

ఆలయ అనుబంధ నిర్మాణాలన్నీ
భక్తి భావాన్ని పెంచాలి

వంద ఎకరాల అడవి నృసింహ
అభయారణ్యంగా అభివృద్ధి
స్వామివారి పూజలకు
అవసరమైన పూలు, పత్రి ఇక్కడి
నుంచే అమ్మవారి పేరుమీద
50 ఎకరాల్లో కల్యాణ మండపం
వైటిడిఎకు 2157 ఎకరాల
అప్పగింత ఆలయ
పరిసరాలు, రింగ్ రోడ్డు మధ్య
చుక్క నీరు నిల్వకూడదు
అందుకు అనుగుణంగా డ్రైనేజీ
వ్యవస్థ అభివృద్ధి యాదాద్రి
ఆలయ అధికారులతో సిఎం
కెసిఆర్ కుటుంబసభ్యులతో
కలిసి స్వామిని దర్శించికున్ను
ముఖ్యమంత్రి ఆలయ దివ్య
గోపురం స్వర్ణ తాపడానికి కిలో
16 తులాల బంగారం
అందజేత

మన తెలంగాణ/యాదాద్రి/హైదరాబాద్ : యాదాద్రి టెంపుల్ టౌన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.ఆలయానికి అనుబంధంగా జరిగే నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్మాణం కోసం ఇచ్చే దాతల విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన 80జి అనుమతులు వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. ్ర యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాలకు రోడ్డుమార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గం టలకు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదాద్రి గుట్ట చుట్టూ వాహనంలో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం సి ఎం కెసిఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకున్నారు. అక్కడ యాదాద్రి అభివృద్ధిపై మంత్రులు, అధికారులతో సిఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ప్రణాళిక ప్రకారం పరిసరాలు అభివృద్ధి కావాలన్నారు. హెలీపాడ్‌ల నిర్మాణం కూడా చేపట్టాలన్నా రు. యాదాద్రి ఆలయ వైభవానికి అనుగుణంగా వైటిడిఎ సమీపంలో జరిగే ప్రైవేటు నిర్మాణాలకు, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతులివ్వాలన్నారు.

వైటిడిఎపరిధిలో ఉన్న100 ఎకరాల అడవిని “నృసింహ అభయారణ్యం” పేరిట అద్భుతంగా అభివృద్ధి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. స్వామివారి నిత్య పూజలు కల్యాణం అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు ఆ అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుమీద ఒక అద్భుతమైన కల్యాణ మండపం నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. ఆలయంతో సహా రింగు రోడ్డు మధ్యలో ఏ ప్రాంతంలోనూ ఒక్క చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు సహా ఇతర అన్నిచోట్ల ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్‌టిసి బస్టాండు, స్టామ్ వాటర్ డ్రయిన్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేవాలయం అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఫోన్‌లో ఆదేశించారు.

ఆధ్యాత్మిక డిజైన్లతో కాటేజీలు ఉండాలి

250 ఎకరాలలో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా అద్భుతంగా నిర్మించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లను పెట్టాలని సూచించారు. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రీన్ ఏర్పాటు చేయాలని సిఎం పేర్కొన్నారు.

వైటిడిఎకు 2,157 ఎకరాల భూమి అప్పగింత

వైటిడిఎకు అవసరమైన 2,157 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దాని నిర్వహణను వైటిడిఎ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీసు శాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్ రవాణా పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. వైటిడిఎకు కేటాయిస్తున్న భూమిలోనేఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇళ్ల స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో ఉన్న విలేకరులకు వైటిడిఎ బయటప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని కలెక్టర్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు

దైవ దర్శనానికి వచ్చిన సిఎం కెసిఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఎం దంపతులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కెసిఆర్ కుటుంబం తరఫున మనవడు హిమాన్షు యాదాద్రీశునికి పట్టు వ్రస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు కెసిఆర్ దంపతులను కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

కిలో బంగారం కోసం చెక్కును అందించిన సిఎం

స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం సిఎం కెసిఆర్ దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన ఒక కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52.48 లక్షల చెక్కును ముఖ్యమంత్రి దంపతులు, కుటుంబసభ్యుల సమక్షంలో వారి మనవడు కల్వకుంట్ల హిమాన్షురావు చేతుల మీదుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఆలయ అధికారులకు అందజేశారు. అలాగే యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒకకిలో బంగారం కోసం ఇచ్చిన రూ.50 లక్షల 15 వేల చెక్కును, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి ఒక కిలో బంగారం కోసం రూ. 51 లక్షల చెక్కును, ఏనుగు దయానంద రెడ్డి ఒక కిలో బంగారం కోసం రూ. 50 లక్షల 4 వేల చెక్కును అధికారులకు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం సిఎం యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు.

యాదాద్రి పర్యటనలో కెసిఆర్ దంపతులతోపాటు, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జి. జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆశన్నగారి జీవన్ రెడ్డి, జెడ్‌పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సిఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, యాదాద్రి ఇఒ గీతారెడ్డి, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఆర్ అండ్ బి ఇఎన్‌సిలు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఆర్‌డిఒ భూపాల్ రెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎండి మనోహర్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం

యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసి కానుకలు అందచేసిన సిఎం కెసిఆర్….తదనంతం ఆయన అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. సాయంత్రం 4.33 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి సుమారు ఆరు గంటల ప్రాంతంలో ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News