Tuesday, January 21, 2025

నిలువెత్తు సంక్షేమ రూపం

- Advertisement -
- Advertisement -

భారత రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సంక్షేమం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని సిఎం కెసిఆర్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. ఎనిమిదిన్నర ఏళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపి నిలువెత్తు సంక్షేమా రూపంగా నిలిచారు. కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. అందులో ముఖ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు,తాగునీరు అందిస్తున్నారు.

అప్పులు చేసి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని భావించి రైతుబంధు ద్వారా పంటకు పెట్టుబడి అందించి వారిని ఆదుకుంటున్నారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు రూ.5 లక్షలతో రైతుభీమాను అమలులోకి తెచ్చారు. రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఎరువులు, విత్తనాలను రైతులకు అందించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2016, వికలాంగులకు రూ.3016 ఆసరా పింఛన్లతో జీవన భద్రత కల్పించారు.

ఇల్లు లేని నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రూ.1,00,116తో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. పేద ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం కోసం రూపాయికి కిలో బియ్యం చొప్పున ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల బియ్యం ఇంటికి పెద్దకొడుకై అందింస్తున్నారు.అమ్మ ఒడి ద్వారా గర్భవతులైన మహిళలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, ప్రసవానంతరం తల్లి బిడ్డకు అవసరమైన 16 వస్తువులతో కెసిఆర్ కిట్ ఇచ్చారు.

గర్భవతి కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చేందుకు రూ. 12000, ఆడపిల్లను కన్న తల్లికి అదనంగా రూ.1000 ఇచ్చి ఆదుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సాహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్, డయాగ్నస్టిక్ సెంటర్లు, క్యాన్సర్ పరీక్ష కేంద్రాలు, ఆరోగ్యశ్రీ, 108,104 వంటి వాటితో ప్రజా వైద్యాన్ని అభివృద్ధి చేయటం గమనర్హం. ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీల కోసం కెజి టు పిజి ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు ఉన్నత ప్రమాణాలతో కూడిన రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేశారు. 2014 నాటికి 298 గురుకులాలు ఉండగా నేడు రాష్ట్రంలో 1000 కి పైగా ఉన్నాయంటే విద్యారంగంలో సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవచ్చు.

దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత ఎంటర్ప్రెన్యూర్ (T-Pride) అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. ఎస్‌సి, ఎస్‌టి మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీ 35 శాతం నుండి 45 శాతానికి పెంచారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ కోసం భూమి లభ్యతను బట్టి కొనుగోలు చేసి అందించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని 10 లక్షల ఆర్థిక సహాయంతో దళిత బంధు తెచ్చారు. గిరిజనుల అభివృద్ధి పథంలో నడిపించేందుకు స్వయంపాలన కోసం తండాలు, ఆదివాసీ గూడాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారు. అన్ని వర్గాల వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టారు.

గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతినీ అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు. దళిత, గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయుటకు అన్ని ఇండస్ట్రియల్ పార్కులలో 22 శాతం మేరకు స్థలాలను రిజర్వ్ చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా గొర్రెల పంపిణీ ద్వారా గొల్ల కురుమల, చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపారు.

చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేశారు. సబ్సిడీ యంత్రాలు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నుండి నేతన్నలను కాపాడారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్స్, అలాగే దళితులకు 100 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. మేదరి, వడ్డెర, విశ్వకర్మ, గౌడ తదితర కుల వృత్తుల వారందరికీ ఆర్థిక సహకారం ఇచ్చి పరికరాలు పంపిణీ చేశారు. గౌడ కులస్తులే నీరా తీయటం, విక్రయించేలా నీరా పాలసీని రూపొందించారు. కల్లుగీత, మత్స్యకారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించారు. మైనార్టీల పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీరుణాలు అందించారు.

ముస్లిం అనాథ పిల్లల ఆశ్రయం కోసం నివాస స్థలాన్ని, భవన నిర్మాణం చేపట్టారు. రంజాన్, క్రిస్మస్ పండగలకు ప్రతి ఏటా కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో పేదల పాలిట పెన్నిధిలా నిలుస్తున్నారు. ఏదో ఒక రూపం లో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టని అనేక అంశాలను కెసిఆర్ అమలు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. తన పంటకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రైతుకు, తన వైద్యానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడని భరోసా ప్రతి రోగికి, పిల్లల చదువుకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా తల్లిదండ్రులకు, తలెత్తుకొని నడిచే సాధికారిత మహిళలకు, శేష జీవితానికి దిగులు లేదనే భరోసాను వృద్ధులకు కల్పించిన గొప్ప మానవీయ ముఖ్యమంత్రి మన కేసీఆర్.

బోల్లికొండ వీరేందర్
9866535807

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News