Sunday, December 22, 2024

ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇచ్చిపుచ్చుకుందాం

- Advertisement -
- Advertisement -

CM KCR discussed with Uddhav Thackeray on irrigation

 

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై సాగునీటి పథకాల నిర్మాణాల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్న అభిప్రాయానికి వచ్చాయి. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే ఆహ్వానం మేరకు ముంబై వెళ్లారు. ఆ రాష్ట్ర సిఎం థాక్రేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక సమావేశంలో నీటిపారుదల రంగంపై కూడా చర్చ జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌లో ఉన్న పలు ప్రాంతాలు భాషాప్రయుక్త రా్రష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాద్ నుంచి విడిపోయి మహారాష్ట్రలో కలిశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ , సోదర రాష్ట్రాలే అన్న అభిప్రాయం ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రతిఫలించింది. రెండు రాష్ట్రాల మధ్య సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర అంతర్రాష్ట్ర సరిహద్దు ఉన్న నేపధ్యంలో సరిహద్దు సమస్యలు తలెత్తకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు.

ప్రత్యేకించి గోదావరి నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రులిద్దరూ ఒక అవగాహణకు వచ్చారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన రిజర్వాయర్ వెనుక జలాల్లోనే అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి వివాదాలకు తెరలేపింది. ఈ అంశంపై అప్పటి ఎపి ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర జలసంఘం అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మించినదే అయినప్పటికీ, నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు కట్టడాలను తొలగించడం భావ్యం కాదని న్యాయస్థానం అభిప్రాయ పడింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా బాబ్లిపై తీర్పునిచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గోదావరి నదీజలాలను ఉపయోగించుకోవటంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పోరుగున ఉన్న మహారాష్ట్రతో స్నేహపూర్వక చర్చల ద్వారా అంతర్రాష్ట్ర నదీజల వివాదాల సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నారు.

ఈ నేపధ్య్యంలోనే ఆదివారం నాటి ముఖ్యమంత్రుల సమావేశంలో మరోమారు సాగునీటి పథకాలు చర్చకు వచ్చాయి.డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు చర్చకు వచ్చింది. ఆసిఫాబాద్ , మంచిర్యాల జిల్లాలలో 2లక్షల ఎకరాలకు సాగునీరందించేందకు ఈ ప్రాజెక్టు కోసం ప్రాణహిత నది వైన్‌గంగ , వార్ధ నదుల సంగమం సమీపంలో బ్యారేజీని ప్రభుత్వం ప్రతిపాదించింది. కౌటాల మండలం తుమ్మడిహెట్టి వద్ద ఈ బ్యారేజీ ద్వారా 20టిఎంసిల నీటిని మళ్లించనున్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టిన లెండి ప్రాజెక్టు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చేపట్టిన లెండి ప్రాజెక్టు ప్రధాన పనులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా గోనెగాం గ్రామం వద్ద ఉన్నాయి. లెండిని రెండు రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేందుకు 2003లోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణలో 22వేల ఎకరాలకు , మహారాష్ట్రలో 27వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 38, 62 నిష్పత్తిలో భరించనున్నాయి. హెడ్‌వర్క్ పనులు 75శాతం పైగా పూర్తయ్యాయి.

ముంపు గ్రామాలు మహారాష్ట్రలో ఉన్నందున ఈ సమస్యపై ఇరువురు సిఎంలు చర్చించారు. దిగువ పెన్‌గంగా ప్రాజెక్టుపై కూడా చర్చించినట్టు సమాచారం. దిగువ పెన్‌గంగా ప్రాజెక్టు గోదావరి నదికి ఉపనదిగా ఉన్న పెన్‌గంగా నదిపై మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మద్య ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టారు. చనాకకొరాట ప్రాజెక్టు పనులపై కూడా మహారాష్ట్ర ,తెలంగాణ ముఖ్యమంత్రులు చర్చించినట్టు సమాచారం. దిగువ పెన్‌గంగా ప్రాజెక్టు కింద ఆయకట్టు ప్రాంతానికి త్వరితగతిన సాగునీటి ప్రయోజనాలను అదించడానికి సత్వర ప్రయోజనాల సాధనకు మహారాష్ట్రలోని రాజపేట వద్ద , పింపర్డ్ అనే రెండు బ్యారేజిలు, తెలంగాణ రాష్ట్రం చెనాక కోరాట వద్ద బ్యారేజిని పెన్‌గంగా డ్యాం క్రింద సంయుక్త వెంచర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. గోదావరి నది పరివాహకంగా చేపట్టిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి ఉన్న సమస్యలను సామరస్య పూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుని త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేసుకునేవిధంగా ముందుకు సాగాలని ఇటు తెలంగాణ సిఎం కేసిఆర్, అటు మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే ఏకాభ్రియానికి వచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైతే మరో మారు చర్చించేందకు హైదరాబాద్‌కు రావాలని తెలంగాణ సిఎం కేసిఆర్ మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రేకు ఆహ్వనం పలికారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News