Monday, December 23, 2024

వివక్షపై ఖడ్గం

- Advertisement -
- Advertisement -

అప్పుడు స్వరాష్ట కోసం…
ఇప్పుడు గుజరాతీయుల ఆధిపత్యంపై కెసిఆర్ ఉద్యమం

మన తెలంగాణ/హైదరాబాద్ : పరాయి పాలన ఆంగ్లేయుల ఆధిపత్యంపై కాలుదువ్విన భారతీయులు వారిని తరిమి కొట్టే వరకూ మహా సంగ్రామమే చేశారు. అదే స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్షకు గురవుతున్న తెలంగాణ ప్రజలు రగిలిపోయి కోసం అస్తిత్వం, ఆత్మగౌరవ నినాదంతో సాగించిన మలివిడత ఉద్యమం ద్వారా కెసిఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారు. ఉద్యమ సారథిగా గులాబీ జెండా ఎత్తిన కెసిఆర్.. స్వరాష్ట్ర సాధకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో దేశంలో గుజరాతీల ఆధిపత్యంపై మరో పారాటానికి సిద్ధమయ్యారు. జాతీయ పార్టీ స్థాపించి శక్తివంతమైన ప్రధాని నరేంద్రమోడీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో బలమైన నేత అయిన నరేంద్రమోడీని కెసిఆర్ టార్గెట్‌గా చేసుకున్నారు. అయితే మోడీ రాజకీయం కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అందుకే ఆయన ఒకప్పుడు అంటరాని నేతగా ఉన్న ఆయన ఇప్పుడు పవర్ ఫుల్‌గా ఎదిగారు. ఇతరులెవరూ టచ్ చేయలేనంతగా ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి నేతతో కెసిఆర్ రాజకీయ పోరాటం చేయడానికి సిద్దమయ్యారు.

రాజకీయమే ఊపిరిగా….

రాజకీయాల్లో ఏదో విధంగా గడిపేద్దామనుకునేవారికి భవిష్యత్తు ఉండదు. రాజకీయమే శ్వాసగా బతికే వారు మాత్రం ఎక్కువ కాలం ఉంటారు. అలాంటి రాజకీయ నేతలు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సీనియర్ నేతల్లో ప్రధాని నరేంద్రమోడీ, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు. సిఎం కెసిఆర్ కూడాఆ కోవాలోకి వస్తారు. ఎవరు ఎక్కువ రాజకీయాన్ని శ్వాసిస్తారో వారిదే అంతిమ విజయంగా మారుతోంది. ఇప్పటి వరకూ ఈ రేసులో మోడీ చాలా ముందున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఛాలెంజ్ చేసేందుకు సమకాలీకులు శక్తిని కూడ దీసుకునే ప్రయత్నం పలుమార్లు చేశారు. కానీ చాలా మంది నాయకులు మధ్యలోనే ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. వారు చేసిన ప్రయత్నాల్లో కాకుండా కెసిఆర్ సరికొత్త మార్గంలో మోడీని సవాల్ చేయాలని నిర్ణయించుకున్నారు. నేరుగా జాతీయ పార్టీ పెట్టి మోడీని ఢీ కొట్టాలనుకుంటున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ లెవల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయంటే….. మీలో (టిఆర్‌ఎస్) చాలా మంది కేంద్రమంత్రులు కాబోతున్నారని సొంత పార్టీ నేతలకు భరోసా ఇచ్చేంత. ఇది చెప్పడానికి చాలా సులువుగా ఉంటుందని అనుకోవచ్చుగానీ…. కెసిఆర్ బ్యాక్ గ్రౌండ్ గురించి కాస్త ఆలోచిస్తే నవ్విన నాపచేనే పండుతుందన్న సామెతను ఆయన నిజం చేసి చూపించారు. ఆయన భాషలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అసాధ్యమని నూటికి 99 శాతం తేలిగ్గా తీసుకున్నా…. ఎన్నో సార్లు అధపాతాళానికి పడిపోయినా తిరిగి లేచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ మోడీని అదే పద్దతిలో ఢీకొట్టాలనికుంటున్నారు.

కూటమి కన్నా సొంత పార్టీకే మొగ్గు

జాతీయ రాజకీయాల వైపు కెసిఆర్ చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. కూటమి కన్నా సొంత పార్టీకే మొగ్గు చూపారు. ప్రాంతీయ పార్టీల కూటమితో కుస్తీ పట్టడం కన్నా సొంత పార్టీనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ప్రాంతీయ పార్టీ నేతగా తాను ఇతర పార్టీలతో కూటమి కట్టాలని ఆయన మొదట భావించారు. దీని కోసం కెసిఆర్ చాలా రాష్ట్రాలు తిరిగారు. కానీ మోడీపై పోరాడేందుకు వారిలో కావాల్సినంత ఫైర్ లేదని కెసిఆర్ గ్రహించారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసి భావస్వారూప్యం గల పార్టీలతో కలిసి పోరాటం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

దేశంలోని రైతులందరిని ఏకం చేసే వ్యూహం

తెలంగాణ ప్రజలను ఏకం చేసినట్లుగా దేశంలోని రైతులందరిని ఏకం చేసే వ్యూహాన్ని కెసిఆర్ ఎంచుకున్నారు. ఏదో రాజకీయ పార్టీ పెట్టి మంచి చేస్తా.. ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఎవరూ ఓట్లేయరని ఆయనకు తెలుసు. రాజకీయాలంటేనే ఈక్వేషన్స్…. ఎమోషన్స్ మిశ్రమం అని విశ్వసిస్తారు. ఇప్పటి రాజకీయాలు మొత్తం వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ ఫార్ములాతోనే కెసిఆర్ రాజకీయంగా యుద్ధం చేసి తెలంగాణ సాధించారు. అందుకే ఆయన భారతీయులందర్నీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు రైతు ఎమోషన్‌ను ఎజెండాగా చేసుకున్నారు. మోడీ సర్కార్ చేసిన తప్పులతో రైతులందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే కొన్నాళ్ల క్రితం ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇచ్చారు. తెలంగాణలో రైతులకు తాము చేస్తున్న మేలు గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించి…. తెలంగాణలో రైతులకు చేస్తున్న మేలును వివరించారు. అందరం కలిసి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని భరోసా ఇచ్చారు. కెసిఆర్ పిలుపు రైతు సంఘాల నేతలను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. రైతు నేతలంతా చట్టసభల్లో ఉండాలని కెసిఆర్ అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News