Monday, January 20, 2025

కెసిఆర్ ఒక అవసరం, అనివార్యం

- Advertisement -
- Advertisement -

కర్షకులు కేంద్రీకృతంగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా ఎంతో మంది భావిస్తున్నారు. అదే సమయంలో సహజంగానే కొన్ని సందేహాలు ముందుకు వచ్చాయి. ఓ ప్రాంతీయ పార్టీ నాయకునికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుందా? వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీకి కేడర్ సమకూరుతుందా? మీడియాలో ఎంత వరకు చోటు దక్కుతుంది? తదితర ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటికీ కచ్చితమైన సమాధానాలు ఉన్నాయి.

ప్రాథమిక రంగమైన వ్యవసాయం సమస్యల వలయంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. యువత ఎవరూ ఈ రంగంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. మరి ప్రాథమిక అవసరాలను తీర్చుతున్న ఈ రంగాన్ని అలాగే విడిచిపెట్టయడమేనా? అలా వదిలేయకుండా ఉండడానికే కెసిఆర్ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అది సాకారం దాల్చడం కోసమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదాన్ని ఇచ్చారు. సమకాలీన రాజకీయాల్లో రైతాంగ సమస్యలపై ఇంత స్పష్టత ఉన్న నాయకుడు మరొకరు కనిపించడం లేదు. అందుకే ఇండియా రియాక్ట్ అవుతోంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతుల సమస్యలన్నీ ఒక్కటే. వీటి పరిష్కారానికి పార్టీలు, ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా వాటిలో సమగ్రత కరవయింది. అన్నదాతల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. దీన్ని అధిగమించడానికే సాగు నీరు నుంచి మార్కెటింగ్ వరకు సమగ్ర విధానం తీసుకురావాలన్నదే కెసిఆర్ ప్రతిపాదన. దాన్ని తెలంగాణలో అమలు చేసి చూపిస్తున్నారు. ఇదే రైతులందర్నీ ఆకర్షిస్తోంది. అందుకే రైతులే బిఆర్‌ఎస్ కు కేడర్ గా మారుతున్నారు. కెసిఆర్ ప్రతిపాదించిన సమగ్ర వ్యూహంలో మొదటిది సాగు నీటి కల్పన.

సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడమే ప్రణాళికలో తొలిమెట్టు. ఇక్కడో ప్రశ్న ఎదురవుతోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీటి కోసం. నీటిపై పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక జాతీయ పార్టీగా బిఆర్‌ఎస్ ఎలా వ్యవహరిస్తుందన్నది సవాలుగా మారింది. దీనిపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తొలి నాళ్లలోనే కెసిఆర్ స్పష్టత ఇచ్చారు. ఓ సందర్భంలో మాట్లాడుతూ “మేం కోస్తా ప్రజానీకానికి, రైతాంగానికి వ్యతిరేకం కాదు.
కోస్తా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే ఆలోచన లేదు. మేం మొదటి రోజు నుంచే ఈ మాటే చెబుతున్నాం. అందుకు చరిత్ర, మూడు సంవత్సరాల మా ప్రవర్తన, మేం వ్యవహరించిన తీరుతెన్నులే నిండైన నిదర్శనం. ఈ రోజు కూడా తెలంగాణకు వచ్చే వాటా తెలంగాణకు రావాలని అంటున్నామే తప్ప కోస్తాకు వచ్చే వాటాను మళ్లించి మాకు ఇవ్వాలని ఎన్నడు చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టును ఎన్నడు వ్యతిరేకించలేదు”అంటూ వివరణ ఇచ్చారు. ఒక్క కృష్ణా నది విషయంలో తప్ప గోదావరి జలాలపై పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే గోదావరి నది ద్వారా ఏటా కనీసం వేయి టిఎంసిల జలాలు వృథా గా సముద్రంలో కలిసిపోతున్నాయి.వాటిని సద్వినియోగం చేసుకుంటే అందరికీ హ్యాపీ అన్నది ఆయన ఆలోచన.

అందుకే పోలవరం ప్రాజెక్టుకు మద్దతు తెలిపారు. ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్టా డెల్టాకు మళ్లిస్తే ఆ మేరకు కృష్టా నదిలో నీరు మిగులుతుంది. ఈ మిగులు జలాలను కరవు ప్రాంతాలకు పారిస్తే ఇక్కట్లన్నీ తీరిపోతాయి. నదీ జలాల వివాదాలు అన్న మాటలే వినిపించవు. అందుకే దేశంలో లభించే నీరు, వినియోగించాల్సిన తీరు పై పదేపదే లెక్కలు చెబుతుంటారు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. వీటికి 30 వేల టిఎంసిల నీరు సరిపోతుంది. దేశంలో 75 వేల టిఎంసిల నీరు లభ్యమవుతోంది. ఇంత నీరు ఉన్నా పొలాలు బీడుగా ఉంటున్నాయి. జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి.

ఇదే కెసిఆర్ ను బాధిస్తున్న విషయం. నీటిని ఎందుకు పొలాలకు పారించలేకపోతున్నామన్నది ఆయన ప్రశ్న. ఈ కారణంతోనే సాగునీటి సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణలో సాధించిన విజయాలను దేశ వ్యాప్తం గా విస్తరించాలని భావిస్తున్నారు. ఇదే దేశ రైతాంగాన్ని ఆకర్షిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ అవసరం ఉందని గట్టిగా భావిస్తోంది.
ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా అన్నది మరో ప్రశ్న. అందులోనూ దక్షిణాది నాయకుడు ఉత్తర భారతంలో ప్రభావం చూపగలరా అన్నది మరో సందేహం. అభివృద్ధికే కాదు నాగరికతకే పునాది లాంటి వ్యవసాయ రంగం కుంగిపోతున్నప్పుడు ఎవరో ఒకరు చొరవ తీసుకోక తప్పదు. అది కెసిఆరే ఎందుకు కాకూడదు? ఈ చొరవ కారణంగానే ఆయనపై అన్ని రాష్ట్రాల్లో ఆయనపై ఆసక్తి నెలకొంది.

రైతుల అందరి సమస్యలు ఒకటే అయినప్పుడు, వాటికి పరిష్కారం చూపుతానని ఓ నాయకుడు చెబుతున్నప్పుడు సహజంగానే నమ్మకం కలుగుతుంది. ఒక ప్రాంతం సమస్యలపై అక్కడి వారి ఆలోచనలు ఒకలా ఉంటే వేరే ప్రాంతం వారి దృష్టి కోణం ఇంకోలా ఉంటుంది. ఒక దక్షిణాది నాయకునిగా ఉత్తర భారత దేశ రైతుల ఇబ్బందులకు కొత్త తరహా పరిష్కారాలు చూపించవచ్చు. సమస్యల ఊబిలో కూరుకుపోయిన వారికి ఏ కొత్త ఆలోచన అయినా అంగీకార యోగ్యంగానే ఉంటుంది. అందువల్ల ఉత్తరాదిలో ఆదరణ లభించదన్నది కేవలం అపోహ మాత్రమే.కెసిఆర్ చేపట్టిన మరో ప్రయోగం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆదరణ పొందుతోంది. అదే రైతు బంధు. ఉత్పత్తి ఖర్చులు రైతుల చేతుల్లో లేవు. ధరల నిర్ణయంలోనూ వారి పాత్ర ఏమీ ఉండదు. అందుకే మొత్తం నష్టాన్ని భరిస్తూ అప్పుల పాలవుతున్నారు.

ఇక్కడే ఫ్రభుత్వ సాయం అవసరమవుతుంది. రైతు బంధు రూపంలో ఆర్థిక సాయం చేస్తే ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. ఆ మేరకు లాభం వస్తుంది. మార్కెట్లో ధరలు కొంచం అటూ ఇటూ అయినా నికరంగా కనీస ఆదాయం పొందే వీలుంది. రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్న కొందరు స్థోమత గల రైతులు కౌలు సొమ్ము తీసుకోకుండానే తమ భూములను ఉచితంగా కౌలుకు ఇస్తున్న సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇదీ కొంత మేలే. దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తే వ్యవసాయం అంటే విముఖత తొలగిపోతుంది. తెలంగాణలో ఈ పథకం విజయవంతమైనందున ఇతర ప్రాంతాల వారిలోనూ ఆసక్తి కలిగింది.
కెసిఆర్ లోని మరో సానుకూలాంశం మత సామరస్యం, సమ్మిళిత తత్వం. శాంతి, సామరస్యాల కారణంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్న విషయాన్ని ఆయన శత్రువులు సయితం ఒప్పుకొని తీరాల్సిందే. వ్యక్తిగతంగా హిందూ మతాచారాలను అన్నింటినీ ఆయన పాటిస్తారు. ఎక్కడా వాటిని రాజకీయాల కోసం వాడుకోవడం లేదు. ఇతర ప్రాంతాలు, మతాల వారిని గౌరవిస్తున్నారు. అందుకే హైదరాబాద్ అందరికీ భాగ్యనగరంగా మారింది. అన్ని రాష్ట్రాల వారు ఇక్కడికి ఉపాధి కోసం వలస వస్తున్నారు. పా

లమూరు కూలీల దుస్థితిని స్వయంగా గమనించిన ఆయనకు ఇతర ప్రాంతాల కార్మికులపై సానుభూతి ఉంది. మెరుగైన ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం మంచిదే కావచ్చు. కాని సొంత ఊరిలో ఉపాధి లేక పొట్టచేత పట్టుకొని పరాయి ప్రాంతానికి వెళ్లడం బాధాకరం. ఈ రెండు రకాల వలసలపైనా ఆయనకు స్పష్టత ఉంది. మంచి అవకాశాలను వెతుక్కొంటూ నగరాలకు వచ్చే వారికి ఏ సౌకర్యాలు కల్పించాలి, కనీస ఉపాధి కోసం గ్రామాలను వీడకుండా ఏమి చేయాలన్నదానిపైనా అవగాహన ఉంది. వలసలు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ అంశంపై ఆయన చెప్పే మాటలకు ఆదరణ ఉంటుంది.
గంగానది ప్రవాహక ప్రాంతంలో ఉండి నాగరికతను నిర్మించిన ప్రదేశాలు ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల వెనుకబాటుకు వ్యవసాయం, పశు పోషణను విస్మరించడమే ప్రధాన కారణం.

ఈరంగంపై ఆధారపడ్డవారు గత్యంతరం లేక సుదూర ప్రాంతాలైన దక్షిణాది రాష్ట్రాలకు కూడా వలస వస్తున్నారు. కరోనా సమయంలో వారు పడిన ఇబ్బందులు అందరినీ కదిలించివేశాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను పటిష్ఠపరిస్తే వారు ఊరు దాటి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ అన్ని సమస్యలూ రైతులతోనే ముడిపడి ఉన్నందున వాటి పరిష్కారానికి కిసాన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. దానికి జాతీయ స్థాయిలో కెసిఆర్ మార్గదర్శకత్వం వహించడం అనివార్యంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News