Sunday, December 22, 2024

ఫెడరల్ ఉద్యమం

- Advertisement -
- Advertisement -

CM KCR Federal movement దేశ సమాఖ్య వ్యవస్థకు, రాష్ట్రాల స్వతంత్రాధికారాలకు ప్రధాని మోడీ ప్రభుత్వ నిరంకుశ, ఏకపక్ష చర్యల వల్ల ఏర్పడుతున్న ముప్పును తొలగించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీసుకున్న చొరవ, వేసిన సాహసోపేతమైన ముందడుగు దేశమంతటా కొత్త కాంతిని ప్రసరిస్తున్నాయి. ఆ వెలుగులో అన్ని వైపుల నుంచి ఆయనకు మద్దతు పెల్లుబికి వస్తున్నది. దేశ రాజకీయ పటంలోని ప్రముఖులు కెసిఆర్‌ను మెచ్చుకుంటున్నారు. ఫోన్ చేసి తమ అకుంఠితమైన మద్దతును తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరుసగా బహిరంగ సభల్లోనూ, మీడియాతో భేటీల్లోనూ ప్రధాని మోడీ ప్రభుత్వ దూకుడుపై కెసిఆర్ చేసిన నిర్భయమైన, నిశితమైన వ్యాఖ్యలు తెలిసినవే. వ్యవసాయ రంగంపై కేంద్రం గుత్తపెత్తనానికి ప్రయత్నిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. నరేంద్ర మోడీ ప్రధాని పీఠం మీద కొనసాగితే, కేంద్రంలో బిజెపి పాలన అంతం కాకపోతే దేశానికి చెప్పనలవికాని దుర్గతి ప్రాప్తిస్తుందని ఆయన సవివరంగా తెలియజేశారు. మతతత్వంతో ప్రజలను విభజించి పాలించే దురుద్దేశంతో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశాన్ని దట్టమైన చీకటిలోకి నెట్టివేస్తాయని కెసిఆర్ దృఢ స్వరంతో స్పష్టం చేశారు.

మోడీని, బిజెపిని కేంద్ర అధికారం నుంచి తరిమికొట్టవలసిన అవసరం కలిగిందని ఆయన నిర్ధారించారు. ఈ సాహసోపేతమైన స్వరానికి వెంటనే ప్రతిధ్వనులు ప్రారంభమయ్యాయి.తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులను కలుపుకొని కేంద్రం నిరంకుశ పెత్తనంపై సంఘటిత పోరాటం చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రధాని మోడీ పాలనపై కెసిఆర్ నిశిత విమర్శల పర్యవసానంగా వచ్చిందే. ఆ తర్వాత మంగళవారం నాడు మాజీ ప్రధాని దేవెగౌడ కెసిఆర్‌కు ఫోన్ చేసి మతతత్వ శక్తులపై ప్రకటించిన యుద్ధంలో ఆయనకు చివరి వరకు అండగా వుంటామని హామీ ఇచ్చి ఆశీర్వదించారు. బుధవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి తన మద్దతును తెలియజేశారు. ఈ పోరాటంపై చర్చించడానికి ఈ నెల 20వ తేదీన ముంబై రావలసిందిగా కెసిఆర్‌ను ఉద్ధవ్ థాక్రే ఆహ్వానించారు. బిజెపి నిరంకుశ పాలన, దాని మతతత్వ పోకడలు నిరశించదగినవని జాతీయ స్థాయిలో దానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మిద్దామని ఉద్ధవ్ అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం దేశంలోని ఫెడరల్ ఏర్పాటును, రాష్ట్రాల వెన్నెముకను విరిచి పోగులు పెట్టాలని పావులు కదుపుతున్నారు.

వాస్తవానికి కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పుడే ఫెడరల్ వ్యవస్థకు, రాజ్యాంగం నెలకొల్పిన విశిష్టమైన వైవిధ్యానికి పెను ముప్పు విరుచుకుపడింది. ఆ తర్వాత రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా విడుదల కావాల్సిన నిధులను ఇవ్వకుండా గుప్పెట్లో పెట్టుకుంటూ వచ్చిన కేంద్ర వైఖరి ఫెడరల్ ఏర్పాటుపై పడిన మరొక ముష్టిఘాతమని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదంటూ అప్పటి కేంద్ర ప్రభుత్వంపై తరచూ విరుచుకుపడేవారు. రాష్ట్రాలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారంటూ ధ్వజమెత్తేవారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మించిన కాఠిన్యతతో రాష్ట్రాల ఆర్థిక సౌష్టవాన్ని దెబ్బ తీసే చర్యలకు పూనుకున్నారు. వాణిజ్య పన్నుల విధింపుపై రాష్ట్రాలకు గల స్వేచ్ఛను హరిస్తూ దేశమంతటా ఒకే పన్ను సూత్రంతో వస్తు, సేవల పన్నును (జిఎస్‌టి) తీసుకు వచ్చిన మోడీ ప్రభుత్వం దాని నిబంధనల కింద రాష్ట్రాలకు ఇవ్వవలసిన నిధులను బిగబడుతూ వచ్చింది.

ఉమ్మడి పన్ను ఆదాయం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును స్వాగతించిన మోడీ ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రాలకు 30 నుంచి 35 శాతం వరకు మాత్రమే వాటా ఇచ్చిందనే విమర్శ వున్నది. రాష్ట్రాల స్వతంత్ర పాలనకు అవరోధాలు సృష్టిస్తూ లెక్కకు మించినన్ని కేంద్ర పథకాలను రుద్దడం కూడా ఫెడరల్ నీతికి విరుద్ధమే. ఒకే జాతి, ఒకే మార్కెట్, ఒకే రేషన్ కార్డు, ఒకే గ్రిడ్ వంటి నినాదాలన్నీ రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనాన్ని పెంచేవే. ఒకే ఎన్నికలు కూడా అటువంటి దే. క్రమంగా అధ్యక్ష తరహా పాలనను ఆవిష్కరించి రాజ్యాంగానికి చరమగీతం పాడడమే బిజెపి ఉద్దేశం. ప్రభుత్వరంగాన్ని గంపగుత్తగా ప్రైవేటుకు అప్పగిస్తున్న తీరు కూడా ప్రజల అధికారం లో అనుచితమైన జోక్యమే. కర్నాటకలో రెచ్చగొట్టిన హిజాబ్ వివాదం గాని, యుపిలో అడ్డగోలుగా తెచ్చిన లౌ జిహాద్ చట్టం గాని దేశ సెక్యులర్ నిర్మాణాన్ని విధ్వంసం చేసే కుట్రలే. ఫెడరల్ వ్యవస్థకు, సెక్యులర్ నీతికి ప్రధాని మోడీ ప్రభుత్వం నుంచి తలెత్తిన ముప్పును ముఖ్యమంత్రి కెసిఆర్ సకాలంలో గుర్తించి దానిని ముందుకు సాగనివ్వబోనని ఆయన చేసిన ప్రతిజ్ఞ చరిత్రాత్మకమైనది. దానికి వస్తున్న మద్దతు ప్రశంసనీయమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News