Monday, December 23, 2024

మునుగోడు బరిలో కూసుకుంట్ల

- Advertisement -
- Advertisement -

టికెట్ ఖరారు చేసిన సిఎం కెసిఆర్, బిఫాం అందజేత

అభ్యర్థి విజయానికి అంతా కలిసి కృషిచేయాలని పిలుపు
ప్రతిపక్షాలకు పార్టీ సత్తా చూపించాలని ఉద్బోధ

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడులో జరగనున్న ఉపఎన్నికకు అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎంఎల్‌ఎ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. ఈ నియోజకవర్గం టికెట్ కోసం పార్టీలోని పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేశారు. అ యితే సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ అధిష్ఠానం కూసుకుంట్లవైపు మొగ్గు చూపింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చివరి నిమిషం వరకు యత్నించి విఫలమైన మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, మా జీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్‌లను సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌కు పిలుపించుకొని చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ, టికెట్ రాలేదని ఎవరు నిరాశ చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు ఉం టాయని హామీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి నాయకుడు పార్టీ టికెట్ ఆశించడం సర్వసహజమన్నారు.

అనేక కోణాల్లో పార్టీ అధిష్టానం లోతుగా విశ్లేషించిన అనంతరం ఎవరికో ఒకరికే టికెట్ కేటాయిస్తుందన్నారు. అందువల్ల మునుగోడు నియోజకవర్గంలో అభ్యర్ధి ఎవరన్నది చూడకుండా పార్టీ అభ్యర్థి విజయం కోసం అందరు స మష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ ఉప ఎ న్నికలో కారు దూసుకపోవాలన్నారు. ఈ విజయంతో ప్రతిపక్షాలకు మరోసారి మనపార్టీ సత్తా ఏంటో రుచి చూపించాలన్నారు. దీనిని దృష్టిలో పె ట్టుకుని నేతలంతా సమన్వయంతో కలిసి ముందుకు సాగాలన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నేతలకు తప్పకుండా భవిష్యత్తులో గుర్తింపు నిస్తామన్నారు. నాయకుల పనితీరునే గీటురాయిగా తీసుకుంటామన్నారు. కాగా సిఎం కెసిఆర్ సూచన మేరకు కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామని నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్‌లు తెలిపారు.

ఉద్యమకారుడికే పార్టీ టికెట్
మునుగోడు నియోజకవర్గం టికెట్ మరోసారి ఉద్యకారుడికే పార్టీ అధిష్టానం కేటాయించింది. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటున్నట్లుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తర్వాత సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆయనకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై అమితమైన ఆసక్తిని కనబరిచేవారు. అందుకే విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకoగా పనిచేశారు. తదనంతరం కెసిఆర్ పిలుపునందుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. 2003 నుంచి టిఆర్‌ఎస్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. మునుగోడు నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేశారు. 2009 ఎన్నికల్లో మునుగోడు నుంచి మొదటి సారిగా టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి మునుగోడు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ
మునుగోడు ఎన్నికను అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది.సాధారణ ఎన్నికలకు ఈ ఉపఎన్నిక సెమీఫైనల్ అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో అన్ని పార్టీలు విజయం కోసం నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడతున్నాయి. ఇందులో అధికార పార్టీ ఒకింత ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ దాదాపు అన్ని గ్రామాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం పార్టీ అభ్యర్ధిగా కూసుకుంట్లను ఖరారు చేయడంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. మునుగోడులో సత్తా చాటడం ద్వారా బలప్రదర్శన చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా సిఎం కెసిఆర్ ఇమేజ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకొని బరిలోకి దిగనుంది. ఆత్మీయ సమ్మేళనాలు, దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి జోరుగా వెళ్లింది. స్థానికంగా ఇప్పటి వరకు మంత్రి జగదీశ్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే దుబ్బాక, హుజురాబాద్‌లో ఎదురు దెబ్బలను విశ్లేషించుకున్న గులాబీ పార్టీ ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగానే మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులను కూడా రంగంలోకి దింపింది. వీరితో పాటు మరో ఎనభైమందికిపైగా శాసనసభ్యులకు కూడా బాధ్యతలను కట్టబెట్టింది.

ఇక బిజెపి తరఫున ఈటల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున పోలింగ్ పూర్తయ్యే వరకు హరీశ్ రావు కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడంలో నిమగ్నమైన కెసిఆర్ ఇక పోలింగ్ ముగిసే వరకు మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గతంలో మునుగోడులో సభ నిర్వహించిన కెసిఆర్ ప్రచార గడువు ముగిసే ఒకటి, రెండు రోజుల ముందు చండూరులో భారీ సభ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. అలాగే ప్రత్యర్థుల బలాబలాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ నివేదిక తెప్పించుకొని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని సర్వేలు బిఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కెసిఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

వామపక్షల పొత్తు మునుగోడులో కచ్చితంగా లాభం చేకూరుస్తుందనే ఆశతో గులాబీ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో సిపిఐ, సిపిఎం ఓట్లన్నీ బిఆర్‌ఎస్‌కే బదిలీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అలాగే బిఆర్‌ఎస్, వామపక్షాల నేతలతో గ్రామస్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వామపక్ష పార్టీల ముఖ్య నేతలందరూ ప్రచారంలోకి దిగేలా వ్యూహ రచన చేస్తున్నారు. రైతుబంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో పాటు.. గట్టుప్పల్ మండలం ఏర్పాటు, గిరిజనుల రిజర్వేషన్ పెంపు, పోడు భూముల సమస్య పరిష్కారానికి కమిటీలు, కొత్త పించన్లు వంటివి కచ్చితంగా లాభిస్తాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు మునుగోడులో ఆయారాం గయారాంల జోరు కనిపిస్తున్నందున.. పార్టీ క్యాడర్ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఇతర నాయకులు, కార్యకర్తలకు గాలం వేస్తున్నారు.

బిఫాం అందజేసిన సిఎం
మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సిఎం కెసిఆర్ పార్టీ బి ఫామ్‌ను ప్రగతి భవన్‌లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందచేశారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సిఎంకు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు.నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంఎస్‌సిలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News