Wednesday, January 22, 2025

‘సబ్‌కా వికాస్ కాదు’.. సబ్‌కా బక్వాస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/జగిత్యాల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ పాలన అంతా మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి ఊపినట్టు లోడ లోడ మాట్లాడుడు తప్ప దేశానికి ఒనగూరిన ప్రయోజనం అంటూ ఏంలేదని మండిపడ్డారు. మేకిన్ ఇండియా పేరుతో మోడీ సొల్లు కబుర్లు చెబుతూ కాలయాపన చేశారని ధ్వ జమెత్తారు. పైగా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. సంవత్సరానికి 10 లక్షల మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్లిపోతున్నారన్నారు. మేకిన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే… ఉన్న వస్త్రం పోయిందనట్టుగా ఉన్నవి ఊసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. అంతే తప్ప దేశానికి కొత్తగా వచ్చిందేమీ లేదన్నారు. ఈ అంశాలపై దేశంలో ఎక్కడంటే అక్కడ….ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు తాను సిద్ధమన్నారు.

బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆయన టిఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 27 ఎకరాల్లో రూ. 510 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్ భవన సముదాయాన్ని సిఎం ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని మోతె వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ పాలన… దేశానికి ఒక అరిష్టమన్నారు. ఆయన పాలనలో దేశం పూర్తిగా అధోగతి పాలైందని మండిపడ్డారు. కొత్తగా ఉద్యోగాలు రాలేదు గానీ…ఉన్న ఉద్యోగాలను ఊడిగొట్టి యువతను రోడ్డుపై ఛాయ్ అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటికే 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు.

ఈ పరిస్థితిని చూస్తుంటే దేశ భవిష్యత్ ఏమైపోతుందో అన్న భయం కలుగుతోందన్నారు. అందుకే దేశం ప్రతి ఒక్కరూ పిడికిలి ఎత్తాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. దేశ ఆస్తులను పరాయిపాలు కాకుండా కాపాడుకుందామన్నారు. ఈ నేపథ్యంలో దేశం మారాల్సిన అవసరముందన్నారు. గోల్ మాల్ గోవిందం గాళ్లు…. కారుకూతులు కూసేవాళ్లు మనమధ్యనే తిరుగుతున్నారన్నారు. మనం అప్రమత్తంగా లేకపోతే మళ్లీ మునిగిపోయే ప్రమాదం ఉంటదని కెసిఆర్ హెచ్చరించారు. దీంతో చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటదన్నారు. అందుకే దండం పెట్టి మాట్లాడుతున్నానని అన్నారు. నా వెంట నడవండి… తెలంగాణ వస్తదని అప్పట్లో చెప్పానని గుర్తు చేశారు. ప్రజల తోడ్పాటు, ధర్మపురి నరసింహ్మా స్వామి దయ వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. అలాగే మన చుట్టూ జరిగే దాన్ని గమనించకపోతే ప్రమాదంలో పడుతామన్నారు.

మేకిన్ ఇండియా అంటే.. చైనా నుంచి దిగుమతి చేసుకోవడమేనా?

మోడీ పదేపదే మాట్లాడే మేకిన్ ఇండియాపై కెసిఆర్ సెటైర్ వేశారు. మేకిన్ ఇండియా అంటే…..అన్ని వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకోవడమా? అని ప్రశ్నించారు. ఇండియాలో పిల్లలు కాల్చే పటాకులు, పతంగులను ఎగురవేసే మాంజాలు కూడా తయారు చేసుకోలేమా? అని నిలదీశారు. చివరకు దీపాంతాలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి చేసుకునే దౌర్భగ్యంలో ఉన్నామా? ఇదేనా మేకిన్ ఇండియా? అని కెసిఆర్ మండిపడ్డారు. ఇంత అధ్వానస్థితిలో మన దేశం ఉందా? అని ప్రశ్నించారు. అన్ని చైనా నుంచి వస్తే కేంద్రంలో మీరు ఉన్నది ఎందుకన్నారు. మీ చేతకాని తనం వల్లే భారతదేశానికి ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అంతటి అసమర్థ ప్రధానిని నేను ఇప్పటి వరకు చూడలేదని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ పాలనలో ఇప్పటి వరకు ఒక్క మంచి పనైనా జరిగిందా? అని ప్రశ్నించారు. సాగు, మంచినీటి, కరెంట్ రంగంలో మంచి జరిగిందా? అని అడిగారు.

ఊరూరా చైనా బజార్లే

ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని కెసిఆర్ అన్నారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటూ నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కోరుట్ల మిషన్ దవాఖాన పక్కన చైనా బజార్ కనిపిస్తోందన్నారు. అలాగే జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్, కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్ చైనా బజార్‌లే దర్శనమిస్తున్నాయన్నారు. మరి మేకిన్ ఇండియా బజార్ ఎటు పోయాయని ప్రశ్నించారు. మన బజార్లు పోయి ఊరూరుకి చైనా బజార్ ఎందుకు వస్తున్నాయన్నారు.గోర్లు కత్తిరించుకునే నేయిల్ కట్టర్లు, గడ్డం గీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహిస్తున్నదో నిలదీశారు. అసలు దేశం ఏం జరుగుతుందో అన్న అంశంపై ప్రతి ఒక్కరూపెద్ద ఎత్తున ఆలోచన లేయాలని పిలుపునిచ్చారు.

కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న కేంద్రం

పేదల వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వకూడదంట కానీ ఎన్‌పిఎ పేరిట కేంద్రం ఇప్పటికే రూ. 14 లక్షల కోట్లను ప్రజల ఆస్తులను దోచి పెట్టిందని కెసిఆర్ విమర్శించారు. ప్రజల సొత్తును…. మీ జాగీర్ లాగా, మీ అబ్బ సొత్తులాగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతామంటే ఊరుకోమన్నారు. దేశ ప్రజలతో కలిసి పిడికిలి ఎత్తి…పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ హెచ్చరించారు. లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్‌ఐసిని అమ్మేస్తాం అంటున్నారు. కేంద్ర బడ్జెట్‌కు సమానంగా ఎల్‌ఐసి రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉందన్నారు. అలాంటి సంస్థలను ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. ఈ సంస్థను రక్షించుకోవాలంటే ఎల్‌ఐసీ ఏజెంట్లు సైనికులుగా కావాలన్నారు.

అలాగే విద్యుత్ సంస్కరణల పేరిట కరెంట్‌ను కూడా ప్రయివేటికరించేందుకు మోడీ యత్నిస్తున్నారని విమర్శించారు. ఈ అధికారం మీకు ఎక్కడిదని నిలదీశారు. ఈ అరాచకం ఇలానే కొనసాగితే పెట్టుబడిదారుల రాజ్యం అవుతది తప్పపేద ప్రజల సంక్షేమాన్ని చూడరన్నారు. సబ్ కా వికాస్ అని చెబుతూనే సబ్‌కా బక్వాస్ చేస్తున్నారని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. అంగన్వాడీల నిధులు కోతపెట్టి బేటీ పడావో… బేటీ బచావో అని నినాదాలు ఇస్తారని ధ్వజమెత్తరు. ఇంకా ఎన్ని రోజుల ఈ మోసపు నినాదాలని కెసిఆర్ మండిపడ్డారు.

మోడీ అసమర్థ పాలన… రాష్ట్రానికి తీరని నష్టం

దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల తర్వాత కడుపునిండా నీళ్లు రావు…. కరెంటు కోతలు తప్పడం లేదన్నారు. ఇలాంటి భారతదేశమేనా మనకు కావాల్సిందన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు, సమరయోధులు త్యాగాలు చేసింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ బాగుపడితే కాదు…దేశం కూడా బాగుపడాలన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ జిడిపి 5లక్షల నుంచి 11.50లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మనలా కేంద్ర ప్రభుత్వం పని చేసి ఉంటే మన జిఎస్‌డిపి 11.50లక్షల కోట్లు నుంచి 14.50లక్షల కోట్లుకు చేరుకునేదన్నారు.కేంద్రం చేతగాని తనం వల్ల తెలంగాణ రాష్ట్రం 3లక్షల కోట్లు నష్టపోయిందన్నారు.

దేశంలో మనమే టాప్

కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినప్పటికీ దేశంలో అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా కొనసాగుతోందని కెసిఆర్ అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాలను దాటి జిఎస్‌డిపిలో పంటల ఉత్పత్తి తలసరి విద్యుత్ వినియోగంతో పాటు అనేక రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచామన్నారు. ఇదంతా సాధ్యమైందంటే ఒక కెసిఆర్, ఒక సిఎస్, మంత్రులతో కాదన్నారు. ఇందులో మనందరి సమష్టి కృషి ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడప్పుడు అనిశ్చిత స్థితి ఉండేదన్నరు. సాగునీళ్లు లేవన్నారు. వలసలు, కరువు కారు చీకట్లలాంటి పరిస్థితుల నుండి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను అనతి కాలంలోనే అధిగమించామన్నారు. అనే క మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో చర్చించి సరైన అంచనాలు వేసి రాష్ట్ర ప్రస్థానాన్ని ప్రారంభించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్ ప్రస్తుతం రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందన్నారు.

ధనిక రాష్ట్రం అవుతుందని ఆనాడే చెప్పా

తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యోగులు కూడా పెన్ డౌన్ చేసి తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడితే దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా మారుతుందని ఆనాడే చెప్పానని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన జీతాలు వస్తాయని తాను చెప్పిన విషయం నేడు నిజమైందన్నారు. అన్ని వర్గాల్లో ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. పంటలు పండించేందుకు ఆనా డు తెలంగాణలో రైతులు నానా ఇ బ్బందులు పడే వారన్నారు. ముఖ్యంగా కరువులో పెరుగన్నం… పురుగు మందులు తాగేవారన్నారు. మరికొందరు దుబాయ్‌కో… ముంబాయికో పోయ అనేక బాధలు పడేవారన్నారు. చెట్టుకొకరైన… గుట్టకొకరైన తెలంగాణ రైతులు బాగుపడాలని అప్పట్లోనే చెప్పానని అన్నారు. ఖచ్చితంగా అద్భుతమైన వనరుగా మార్చుకుందాం సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పానన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల పాటు కరెంటు ఇస్తోందన్నారు. సంవత్సరానికి 13 నుంచి14 వేలకోట్లు కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఇక ఐదు నుంచి పదెకరాలున్న ఉన్న రైతులు ఐదారు శాతం ఉన్నారన్నారు.25 ఎకరాలుపైనున్న వారు కేవలం 0.28శాతం మంది ఉన్నారన్నారు. అందుకే రైతుబంధులో పరిమితి విధించలేదని కెసిఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు…..కెసిఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగవని మరోసారి సిఎం స్పష్టం చేశా రు. అయితే ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రధానంగా వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్, బీమారం, సూరమ్మ చెరువు నింపి మూడు మండలాలకు నీరిస్తామన్నారు. మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్‌ను త్వరలో మంజూరు చేసి ఏర్పాటు చేస్తామన్నా రు. అలాగే పోతారం, నారాయణపూర్ రిజర్వార్లను పూర్తి చేస్తామన్నారు. కెసిఆర్ కంటే ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులను చూశారన్నారు. ఈ ప్రాంతం నుంచి మంత్రులను కూడా చూశారన్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వాల మాదిరిగా ఎవరైనా నిర్ణయాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

గురుకుల విద్యలో మనమే సాటి

గురుకుల విద్యలో మనమే సాటని కెసిఆర్ అన్నారు. ఇండియాలో మనకు పోటీగానీ…. సాటిగానీ ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు కళాశాలలను అన్నివర్గాలకు స్థాపించుకున్నామన్నారు. అందుకే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. ఎవరూ ఊహించనటువంటి రీతిలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. వీటికి కేంద్రం సహకరించకపోయినా సొంతంగా మనమే నిర్మించుకుంటున్నామన్నారు. జగిత్యాలలో కాలేజీని రూ.108 కోట్లతో కళాశాల వైద్యశాఖలకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు.

మారుమూల ప్రాంతాలకు పాలన పరుగులు తీస్తేనే అభివృద్ధి

రాష్ట్రంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు పాలన పరుగులు తీస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కెసిఆర్ అన్నారు. అందుకే పది జిల్లాలున్న తెలంగాణను ముప్పుమూడు జిల్లాలుగా వికేంద్రీకరించినట్లు వెల్లడించారు. దీనిపై కూడా కొందరు అర్ధం పర్ధం లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. చత్తీస్‌గఢ్‌లో బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే పెద్దగా ఉందని ఆరేడు జిల్లాలుగా విభజించారని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు.

రేషన్‌కార్డు ఉన్నా రైతు అడుక్కునే దుస్థితి

ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు రేషన్‌కార్డులు ఉన్నా బియ్యం కోసం అడుక్కునే దు స్థితి ఉండేదన్నారు. ఆ పరిస్థితి నుంచి రైతులు పూర్తిగా బయటడ్డారన్నారు. రా ష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ గణనీయంగా జరిగిందన్నారు. ప్రధానంగా అ గ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగడం వల్ల శాంతి,సౌభాగ్యంపల్లెల్లో అద్భుతంగా ఉంటోందన్నారు.రాష్ట్రంలో అద్భుతమైన గ్రామీణ ఆర్థిక పునాది పరిపుష్టమైందన్నారు. అనేక రంగాల్లో అనేక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామన్నారు. మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తున్నామన్నారు.

త్వరలోనే తెలంగాణ…డైమండ్ ఆఫ్ ఇండియాగా మారుతోంది

అభివృద్ధి పథంలో తెలంగాణ ఇలాగే కృషి చేస్తే డైమాండ్ ఆఫ్ ఇండియానే అవుతుందని కెసిఆర్ అన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లోనే దేశంలో నెంబర్…1గా నిలిచామన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచీగా ఉన్నాయన్నారు. తెలంగాణ మాదిరిగానే కేంద్రం కూడా పనిచేస్తే జిఎస్‌డిపి 14.5 లక్షల కోట్లు ఉండేదన్నారు. అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News