కేంద్రంపై ఇక కొట్లాటే
వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా
ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు
కేంద్రం నుంచి స్పందన రాకపోతే పోరాటం కొనసాగింపు కేంద్రం దిగివచ్చేంత వరకు
వెంటాడుతాం.. వేటాడుతాం.. నిలదీస్తాం పంజాబ్‌కు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా?
ధాన్యం కొనుగోలుపై ద్వంద్వ వైఖరి వీడాలి మహాధర్నా తర్వాత గవర్నర్‌కు వినతిపత్రం
బండి సంజయ్‌వి వట్టి డ్రామాలు నిలదీస్తున్న రైతులపై దాడులు చేస్తారా? ధాన్యం
కొంటరా, కొనరా అని అడిగితే పిట్టకథలు చెబుతున్నారు రైతులతో పెట్టుకుంటే పతనమే
తప్ప లాభం జరగదు టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీ అనంతరం కెసిఆర్ ఫైర్
బండీ.. రైతులకు క్షమాపణ చెప్పు
యాసంగిలో వరి వేయాలని రైతులకు చెప్పావా? లేదా? పొరపాటుగా చెబితే వెంటనే రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పు. తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాయి. కేంద్రం ఒప్పుకున్న విధంగా గత యాసంగిలో ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం తీసుకుంటుందా, లేదా? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ధాన్యం మేమే కొంటున్నా ఇంకా ఆందోళనలు ఎందుకు? అనవసర రాజకీయాలు మానుకో, అడ్డగోలు మాటలు వద్దు.
సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని టిఆర్‌ఎస్ సర్కార్ తీవ్రంగా గర్హించింది. ఇందుకు నిరసనగా ఈ నెల 18వ తేదీన మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వేదికగా గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ మహాధర్నాలో మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులుతో పాటు పార్టీ శ్రేణులంతా పాల్గొంటారని ప్రకటించారు. తాను కూడా ధర్నాకు హాజరవుతున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు. తదనంతరం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్‌కు బుధవారం లేఖ రాయనున్నట్లు సిఎం వెల్లడించారు.
అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తగు స్పందన రాని పక్షంలో టిఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం దిగొచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదన్నారు. మోడీ సర్కార్‌ను ఇక వేటాడుతాం…వెంటాతామని హెచ్చరించారు. కేంద్రంపై యుద్దం మొదలుపెట్టామని.. అది ముగిసేంత వరకు కొనసాగిస్తామన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కెసిఆర్ అధ్యక్షత టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కంటే తమ ప్రభుత్వానికి మరో ప్రాధాన్యత లేదన్నారు. దీని కోసం ఎంతదూరమైనా వెలుతామన్నారు. ఎవరినైనా ఎదురిస్తామన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు.
ధాన్యం కొనగోళ్లపై తాను కేంద్రమంత్రికి స్వయంగా మూడు సార్లు ఫోన్ చేసినా సరైన రీతిలో సమాధానం రాలేదని కెసిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. సాక్షాత్తూ ఒక రాష్ట్రాధినేతగా తాను ఫోన్ చేసినా… కేంద్ర మంత్రులు పట్టించుకోకపోతే ఎలా? అని నిలదీశారు. ఇప్పటి వరకు పండించిన పంటను కొనడం లేదు…. కనీసం రాబోయే పంటను కొంటారా? లేదా? అనేది కూడా స్పష్టత ఇవ్వడం లేదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేస్తోందన్నారు. అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల దగ్గర బిజెపి నాయకులు డ్రామా చేయడం ఏమిటని కెసిఆర్ ప్రశ్నించారు. ఇదే అంశంపై నిలదీస్తున్న రైతులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ నీచ రాజకీయాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్ల కేంద్రాల దగ్గర బిజెపి రంకుతనం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని కెసిఆర్ ఘాటుగా హెచ్చరించారు. పంజాబ్‌లో కొంటున్న విధంగా రాష్ట్రంలోని ధాన్యాన్ని కేంద్రం కొంటదా? లేదా? అన్న అంశంపై స్పష్టం చేయాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. ధర్నా తర్వాత కేంద్రానికి రెండు రోజులపాటు గడువు ఇస్తామని, అప్పటికీ సమాధానం రాకపోతే రైతులకు ప్రత్యమ్నాయ పంటలను వేయాల్సిందిగా సూచిస్తామన్నారు.
అడ్డం… పొడుగు మాటలెందుకు?
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాకాలం వరి కోతలు జరగుతున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా? లేదా అన్నది సూటిగా చెప్పాలన్నారు. దీనిపై రాష్ట్రంలోని బిజెపి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. సూటిగా సమాధానంగా చెప్పకుండా అడ్డం…పొడవు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 6600 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం సేకరించిన ఈ ధాన్యాన్ని కేంద్రం తీసుకుంటాదా? లేదా? అన్న విషయంపై ఢిల్లీ పాలకులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన బాధ్యతను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు అని అన్నారు. రైతులతో పెట్టుకుంటే ఆ పార్టీ ఖతం అవుతుందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ హెచ్చరించారు.
ఇదేమని అడిగిన పాపానికి రైతులపై రకరకాల పద్దతిలో దాడులు చేస్తున్నారు…. ఇదేం… పద్దతి? ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు. వారు మాట్లాడితే దాడులు…తాము ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్రవేస్తారా? అని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. రైతు ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ధాన్యం పంట మార్పిడి చేయాలని ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొంటే ప్రాసెస్ జరిగి బయటకు వెళ్లాలన్నారు. అయితే బియ్యం నిల్వ చేసుకునే పరిస్థితులు ఉండాలని… దేశంలో నిల్వచేసే పరిస్థితి కేవలం ఎఫ్‌సిఐకి మాత్రమే ఉందన్నారు. ఏ ఒక్క రాష్ట్రానికీ ధాన్యం నిల్వ చేసే పరిస్థితి లేదని తెలిపారు. కేంద్రం 20 లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటామని చెప్పిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై మిల్లర్లు ఎదురుచూస్తున్నారన్నారు.
బండీ.. రైతులకు క్షమాపణ చెప్పు
యాసంగిలో వరి వేయమని రైతులకు చెప్పావా? లేదా? అని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను సిఎం కెసిఆర్ సూటిగా ప్రశ్నించారు. పొరపాటుగా చెబితే వెంటనే రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పును ఒప్పుకుని ముక్కునేలకు రాయాలన్నారు. కేంద్రం ఒప్పుకున్న విధంగా గత యాసంగిలో ఇంకా కొనుగోలు చేయాల్సిన ఐదు లక్షల మెట్రిల్ టన్నుల ధాన్యం తీసుకుంటుందా? లేదా అన్న స్వచ్చమైన తెలుగు భాషలో అడుగుతున్నానని అన్నారు. దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు.బాధ్యత లేకుండా మతి తప్పిన మాట్లాడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ధాన్యంపై బిజెపి నాయకులు అంతా గోల్‌మాల్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. ధా న్యం కొంటున్నా ఇంకా ఆందోళనలు ఎందుకు? అని ప్రశ్నించారు. అనవసర రాజకీయాలు మానుకోవాలన్నారు. పిచ్చిమాటాలు…అడ్డగోలు మాటలు వద్దు అని హితువు పలికారు.
సెస్ లేకుండా నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం
నీటి తీరువా లేకుండా రైతులకు సాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణే అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. దీని కారణంగానే రాష్ట్రంలో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయన్నారు. అధిక మొత్తంలో పంటల ఉత్పత్తి పెరిగిందన్నారు. పైగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు కార్యక్రమంతో ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అలాగేవేలకోట్ల పెట్టి పెద్దఎత్తున నీటి ప్రాజెక్టులను నిర్మించామన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పండిన పంటను పూర్తిగాకొనే స్థితిలో కేంద్రం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం కొంటామంటే… కెసిఆర్ ఏమైనా అడ్డుం పడుతున్నాడా? అని వ్యాఖ్యానించా రు. పనికి మాలిన రాజకీయం చేస్తా…అంటే ఒప్పుకునేది లేదన్నారు. మతిలేని మాటలతో రైతులను ఆగం చేయవద్దన్నారు.
రైతులపై అక్కసు ఎందుకు?
62 లక్షల ఎకరాల్లో పంట ఉందని చెప్పినా ఎటూ తేల్చలేదని ముఖ్యమంత్రి అన్నారు. వర్షాకాలంలో పంట తీసుకుంటా రా? లేదా? చెప్పట్లేదని తెలిపారు. ఇతర పంటలు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి రైతులను కోరారని పేర్కొన్నారు. వర్షాకాలం పంట కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చినట్లు కెసిఆర్ తెలిపారు తెలిపారు. యాసంగిలో వరి ధాన్యం వేయవద్దని పునరుద్ఘాటించారు. రాష్ట్రం కొనుగోళ్లు చేస్తుంటే డ్రామాలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే రాళ్లతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవడా పనికిమాలినవాడు చెప్పిండు
కేంద్రంపై పోరాటం చేయడంలో టిఆర్‌ఎస్‌కు ఒక స్టాండ్ లేదని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా…సిఎం కెసిఆర్ ఘాటుగా స్పందించారు. ఎవడా పనికిమాలినవాడు చెప్పిండు…తమకు స్టాండ్ లేదని ప్రశ్నించారు. తలాతోక లేకుండా మాట్లాడం తగదన్నారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకించామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాలపై కూడా తాము నిరసనలు వ్యక్తం చేశామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన అన్ని రకాల నల్లచట్టాలపై మొదటగా తమ వానిని వినిపించామన్నారు. యుపిలో రైతులపై బిజెపి నేతలు తమ కార్లు ఎక్కించి తొక్కించి చంపారన్నారు. రైతులతో పెట్టుకుంటే బిజెపి పతనం ఖాయమన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద బండి సంజయ్‌ను అడ్డుకుంటున్నది టిఆర్‌ఎస్ నేతలేనని అడిగిన ప్రశ్నకు కెసిఆర్ సమాధానమిస్తూ, టిఆర్‌ఎస్ కార్యకర్తలకు భూములు ఉండవా? వాళ్ళు వడ్లు పండించరా? అని నిలదీశారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి 60లక్షల సభ్యత్వం ఉందన్నారు. అందులో- రైతులు లేరా? వాళ్ళు అడుగరా? అని సమాధానమిచ్చారు. ధాన్యంపై అడ్డుగోలుగా మట్లాతామంటే ఇక కుదరదన్నారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని పేర్కొంటూ.. కేంద్రంలోని మోడీ సర్కార్‌కు ఇక చుక్కలు చూపిస్తామన్నారు. పార్లమెంట్‌లోనూ ఇకపై తమ నిరసన గళం మరింత గట్టిగా వినిపిస్తామని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.