Monday, December 23, 2024

సంక్షేమం నుంచి సమానత్వం

- Advertisement -
- Advertisement -

‘ఏ విషయంలోనైనా ఆత్మవిశ్వాసం ఉంటే గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పాలనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సాగుతున్న కెసిఆర్ పాలననే నేడు దేశం అనుసరిస్తున్నది. సంక్షేమం నుంచి సామాజిక సమానత్వం.. తద్వారా అభివృద్ధి.. ఇదే తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అవలంబిస్తున్న ఫార్ములా. సంక్షేమం అంటే డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయడం కాదు బడుగు, బలహీన వర్గాలు సామాజిక సమానత్వం సాధించేలా కృషి చేయడమని అంటారు సిఎం కెసిఆర్. ఇదెలా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు, పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా సామాజిక విప్లవం మొదలవుతుంది. అదే సమయంలో ఆయా వర్గాల భావితరాలు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే అభివృద్ధి సాధ్యపడుతుందనేది కెసిఆర్ ఆలోచన.

పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్ధిక ప్రగతి అస్ధిరమైనదని, అనైతికమైనదని కెసిఆర్ అభిప్రాయం. అయితే దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలు ప్రజాసంక్షేమ పథకాలను ‘రేవడీ’ అనే పేరుతో అవహేళన చేయడం బాధాకరం. ఉచితాలు అంటూ అనుచితంగా వ్యాఖ్యానించడం దారుణం. ప్రతి దాన్నీ లాభనష్టాలతో చూసేందుకు పరిపాలన వ్యాపారం కాదు. సంక్షేమ పథకాలను లాభనష్టాల దృక్పథం తో కాకుండా మానవాభివృద్ధి కోణంలో చూడాలి. ఈ వివేకాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోల్పోవడం దురదృష్టకరం. 2019లో జరిగిన ఆర్ధిక సంఘం సమావేశంలో ఇదే విషయంపై సిఎం కెసిఆర్ ‘ హమ్ తో సర్కార్ చలా రహే హై.. వ్యాపార్ నహీ’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులను వెచ్చించి దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.

గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన రెండువందల రూపాయల పింఛన్‌ను ఆసరా కింద రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 పెంచడం ప్రజల కష్టాలెరిగిన ప్రజా పాలకుడు కెసిఆర్‌తోనే సాధ్యమైంది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొనకపోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు,ఫైలేరియా బాధితులకు, డయాలసిస్ రోగులకు సైతం రూ. 2,016 పింఛన్ ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్ గా అందిస్తున్న తీరు ప్రశంసనీయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 29,21,828 మందికి మాత్రమే పింఛన్లు అందేవి. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆసరా పింఛన్లదారుల సంఖ్యను 44,12,882కు పెంచి ప్రజారంజక పాలనకు తొలి అడుగు వేసిన ఘనత సిఎం కెసిఆర్ దే. గత తొమ్మిదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఆసరా పింఛన్ల కోసం రూ. 54,989 కోట్లు కేటాయించడం నిజంగా ఒక చరిత్రే.
‘నీటి ప్రవాహం ఎప్పుడూ వెనక్కి ప్రవహించదు..

అదే విధంగా మనం నదిలా గతాన్ని మరచిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలన్న‘కెసిఆర్ ఆలోచనకు ప్రతిరూపమే ‘దళితబంధు’. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం దళిత బంధు దేశ పాలకులను సైతం అబ్బుర పరిచింది. దళితజాతి స్వశక్తితో స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో కెసిఆర్ రూపుదిద్దిన ఈ పథకాన్ని చూసి విపక్షాలు ఖంగుతిన్నాయి. విపక్షాల విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, ఆరోపణల నడుమ దళిత బంధును అమలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ధీశాలి కెసిఆర్. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించి ఆదుకోవడమనేది కెసిఆర్ కే సాధ్యమైంది. ‘గొప్ప పాలకులు అనబడేవారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు.

వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మపథం, న్యాయ మార్గాల నుండి వైదొలగరు. ఆత్మగౌరవంతో, దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు ‘అన్న ప్రఖ్యాత కవి తిరువళ్ళువార్ సూక్తులు కెసిఆర్ పాలనను ప్రతిబింబింపజేస్తుంది. దళితులు, గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తీసుకు వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన నిధులు ఇతర పథకాలకు మళ్ళించకుండా తీసుకున్న రక్షణ చర్యల ఫలితమే సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ రాష్ట్రం నిలిచింది.

దళితులకు గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి చరిత్ర పుటల్లో కెసిఆర్ నిలిచారు. గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో ఆదివాసీల హృదయాల్లో కెసిఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు. అసలే కొత్త రాష్ట్రం.. కేంద్రం సాయం మాటే లేదు. ఒక వైపు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాగాని మొక్కవోని ధైర్యంతో కెసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే నేడు దేశం యావత్ తెలంగాణ వైపు చూసే విధంగా చేశాయి.

దేశానికి స్వాత్రంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో బిసి వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. అయితే సబ్బండ వర్గాలను చేయూత నిచ్చి ఆదుకోవాలన్న దృక్పథంతో కెసిఆర్ సంకల్పం వల్ల నేను అన్ని వర్గాల ప్రజలు సమాజంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి రావడం శుభపరిణామం.ఆడపిల్లల పెండ్లి ఖర్చుల భారం భరించలేక నిరుపేద కుటుంబాలు పడుతున్న బాధలను చూసి చలించిన కెసిఆర్ మదిలో పుట్టిన పథకమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల, మతాలకతీతంగా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం 1,00,116 రూపాయల ఆర్ధిక సాయం అందించి వారి పాలిట పెద్దన్నగా నిలిచారు కెసిఆర్. గత తొమ్మిదేళ్ళలో 12 లక్షల 469 మంది ఆడపిల్లలకు పెండ్లి ఖర్చుల క్రింద రూ. 10,416 కోట్లు సాయం అందించడం సంక్షేమ పాలకుడికే సాధ్యమైంది. మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 60 వేల కోట్లకు పైగా నిధులతో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలైతే ఏకంగా ఐక్యరాజ్య సమితే ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతున్నాయి. సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు. ‘ప్రతి ఇంటికీ సంక్షేమం, ప్రతీ ముఖంలో సంతోషం’ అనే నినాదాన్ని అక్షరాల నిజం చేసి చూపింది తెలంగాణ ప్రభుత్వం.

ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్ర పాలకులవడంతోనే అది సాధ్యమైంది. ఈ పాలకునికి ఆ సంకల్పం ఉందని నిరూపితమైంది. ‘సంపదను పెంచుతాం -పేదలకు పంచుతాం’ విధానంతో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సంక్షేమ పథకాలు పేదల కంటే మధ్య తరగతి అభ్యున్నతికే ఎక్కువ ఉపయోగపడతాయని రాబర్ట్ గూడిన్ తన పరిశోధనా పత్రం Not only poor: the middle classes and the welfare Stateలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, మా రాష్ట్రాల్లో కూడా ఎందుకు సాధ్యం కాదు? అని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా నేడు ఆలోచనలో పడవేశారు కెసిఆర్. ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణం. అయితే ఇలాంటి పథకాలనే దేశ మంతటా అమలు చేయాలన్న కెసిఆర్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News