Thursday, January 23, 2025

వైద్య రంగానికి పెద్ద పీట వేసిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: వైద్య రంగానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేశారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ నర్సంపేట వారి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ వైద్య రంగానికి పెద్ద పీట వేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధిక భాగం వైద్యం మీద ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేదలకు వైద్య సౌకర్యాలు అందాలని కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించడం లక్షంగా ముందుకుపోతున్నామన్నారు. దాని కోసం నూతన ఆసుపత్రులను నిర్మించడం, డాక్టర్లను నియమించడం, అధునాతనమైన పరికరాలను అందించడం ద్వారా పేదలకు ఖరీదైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకవచ్చిన సిఎం కెసిఆర్‌కి అందరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు.

కెసిఆర్ కిట్, అమ్మ ఒడి, కెసిఆర్ న్యూట్రీషియన్ కిట్లు, కంటి వెలుగు, అందరికీ వైద్య పరీక్షలు, డయాలసిస్ సెంటర్ల ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించడం లాంటి ఎన్నో రకాల వసతులను ప్రభుత్వ దవాఖానాలో మెరుగుపర్చడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మన నర్సంపేట నియోజకవర్గానికి ఎన్ని రకాల వసతుల కల్పన అందుబాటులోకి వచ్చిందో మీకే తెలుసన్నారు. కరోనాను జయించడంలో నర్సంపేట ప్రజలను చైతన్యపర్చిన నర్సంపేట వైద్య బృందానికి నా కృతజ్ఞతలు. ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు ఆలోచన నాదే. కాని ఆచరణలో పెట్టి వైద్య సేవలను అందించి 579 మంది ప్రానాలను కాపాడిన ఘనత కేవలం నర్సంపేట వైద్య బృందానికే దక్కుతుందన్నారు.

130 రకాల టెస్టులతో కూడిన రూ. 70 కోట్లతో నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మంజూరు తుది దశలో నిర్మాణ పనులున్నాయన్నారు. 57 రకాల టెస్టులకు సంబంధించిన తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు, నిర్మాణం పూర్తి, త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ సిలిండర్లు, కరోనాకు సంబంధించి ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్ లాంటి పలు రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీల ద్వారా 10 వేల మంది లబ్ధిదారులకు రూ. 60 కోట్ల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కిరాయి ఇళ్లలో హెల్త్ సెంటర్లు నడిపిన విషయం అందరికీ తెలుసు. కాని ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా 49 హెల్త్ సబ్ సెంటర్లను మంజూరు చేసుకోవడం, అందులో 50 శాతం వరకు శాశ్వత భవనాలను నిర్మించుకోవడం జరిగింది. మరో రెండు నెలల్లో మిగతావి పూర్తి చేస్తామన్నారు.

నూతనంగా నర్సంపేటకు రూ. 30 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ మంజూరైందన్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఇన్‌ఛార్జి సూపరిండెంటు డాక్టర్ మనోజ్‌లాల్, వైద్య సిబ్బంది, వైద్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News