హైదరాబాద్ ః రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీకి జన్మదిన శుభాకాంక్షలను సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను మర్యాదపూర్వంగా మంత్రి మహమూద్ అలీ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే మంత్రుల నివాస సముదాయంలో మంత్రి మహమూద్ ఆలీ నివాసానికి పలువురు బిఆర్‌ఎస్ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ సినీ నటుడు సుమన్ కలిసి మంత్రి మహమూద్ అలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయనపై రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
ఎంఎల్‌ఎ రవీంద్ర కుమార్, డిజిపి అంజనీ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఎసిబి డిజి రవి గుప్త, జైళ్ళ ఐటి రాజేష్ తదితర అధికారులు, పలువురు బిఆర్‌ఎస్ పార్టీ నేతలు కలిసి మంత్రి మహమూద్ అలీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండగా తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ గోల్నాక ప్రాతంలోని అంజుమన్ ఖాదిమిన్ ముస్లిమీన్ సంస్థలో ఉన్న 500 మంది చిన్నారులకు అన్నదానం చేసి, మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా మొక్కలను నాటుతున్నట్లు ఆయన తెలిపారు. అందరూ మొక్కలను నాటి పర్యవరణ పరిరక్షణ కార్యక్రమాన్ని విజయం వంతం చేయాలని ఆయన కోరారు.