Thursday, January 23, 2025

నర్సాపూర్ నుంచి సునీత…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రస్తుతం నర్సాపూర్ సిట్టింగ్ ఎంఎల్‌ఎగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బిఆర్‌ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సునీతా లక్ష్మారెడ్డిని నర్సాపూర్ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డితో కలిసి పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ సునీత లకా్ష్మరెడ్డికి బి.-ఫాం అందజేశారు. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీ కీలక సభ్యులు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం పట్ల సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…మదన్ రెడ్డి తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు అని పేర్కొన్నారు. 35 ఏళ్ల నుంచి తనతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా తనకు అత్యంత ఆప్తుడు అని, తన కుడి భుజం లాంటి వారు, సోదర సమానుడు అని వ్యాఖ్యానించారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాల మీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎంఎల్‌ఎగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపిగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

మదన్‌రెడ్డి.. వివాద రహితుడు, సౌమ్యుడు
మదన్‌రెడ్డి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మదన్‌రెడ్డికి గుర్తింపు ఉందని, కేవలం నర్సాపూర్‌లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్‌రెడ్డి పాపులర్ లీడర్ అని అన్నారు. వివాద రహితుడు, సౌమ్యుడు, మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉందని చెప్పారు. తనతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బి.ఫాం ఇవ్వడం తనకు సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు, అభినందనలు అని బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తదితరులున్నారు.

సునీతా లక్ష్మారెడ్డి రాజకీయ నేపథ్యం
కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డి ఎంఎల్‌ఎగా గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెబ్‌లో మహిళా శిశు,వికలాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి, 2019 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ సునీతా లకా్ష్మరెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆమె ఆ పదవిలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News