Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ ఆరోగ్యం భేష్

- Advertisement -
- Advertisement -

CM KCR has no health problems

పరీక్షల అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ యశోద వైద్యుల ధ్రువీకరణ
ఎడమచేయి నొప్పిగా ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న సిఎం
వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన డాక్టర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పరీక్షలు నిర్వహించిన సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్య బృందం స్పష్టం చేసింది. సిఎం ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. నీరసం, చేతి నొప్పితో వచ్చిన సిఎంకు శుక్రవారం సోమాజీగూడ యశోద ఆసుపత్రి వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. సిఎం వ్యక్తిగత వైద్యులు, పిజిషియన్ ఎంవి రావు, చీఫ్ కార్డియాల జిస్ట్ ప్రమోద్ కుమార్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విష్ణురెడ్డి సారథ్యంలోని వైద్యుల బృందం ఈ పరీక్షలు నిర్వహించింది. అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ గుండెకు సంబంధించిన అన్ని పరీక్షల రిపోర్ట్ సాధారణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగానే సిఎం ఎడమ చేయి నొప్పిగా నిర్దారణ జరిగిందన్నారు.

ఇది వయసు రీత్యా వచ్చే సమస్యేనని డాక్టర్లు స్పష్టం చేశారు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సిఎంకు సూచించినట్లు తెలిపా రు. వారం రోజుల తర్వాత సిఎం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. కాసేపు ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకున్న అనంతరం సిఎం కెసిఆర్‌ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ అధికార నివాసానికి చేరుకున్నారు. సిఎం వెంట కుటుంబ సభ్యులు సతీమణి శోభ, మనవడు హిమాన్షు, మంత్రి కెటిఆర్, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి హరీష్ రావులతో పాటు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపి మాలోత్ కవిత, ఎంఎల్‌సి లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, రెడ్యానాయక్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిపి సివి.ఆనంద్, డిసిపి జోయల్ డేవిడ్ తదితరులున్నారు.

రెండు రోజులుగా నీరసంగా ఉన్నారు

గత రెండు రోజులుగా సిఎం నీరసంగా ఉన్నారని సిఎం చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విష్ణురెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్లు ఇంటికి వెళ్లి చూశారన్నారు. హాస్పిటల్‌కు వచ్చి పరీక్షలు చేయించుకుంటే మంచిదని డాక్టర్లు సూచించారని….అందుకు సిఎం అంగీకరించారన్నారు. దాంతో ఆయనను హాస్పిటల్ కు తీసుకొచ్చామన్నారు. ఎడమ చేయి నొప్పి ఎందుకొచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేశామన్నారు.

ఎలాంటి బ్లాక్స్ లేవు

ఎడమ చేయి నొప్పి గురించి తెలుసుకునేందుకు , కరోనరీ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా? అనే ఉద్దేశ్యంతో కరోనరీ యాంజియోగ్రాం చేశామని…. అందులో అదృష్టవశాత్తూ బ్లాక్స్ ఏమీ లేవని యశోద హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అలాగే గుండె ఫంక్షన్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఇసిజి, 2డి ఎకో టెస్టులు కూడా చేశామన్నారు. ఆ రెండు కూడా బాగున్నాయన్నారు. తర్వాత హార్ట్‌కు సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఆ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఈ రిపోర్టులన్నింటిని పరిశీలించి అనంతరం సిఎం గుండె సంబంధించిన ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్ లేదని నిర్ధారించామన్నారు. ఆ తర్వాత ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అని పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే మెడకు సంబంధించినటువంటి ఎంఆర్‌ఐ టెస్టు, అట్లాగే బ్రెయిన్‌కు సంబంధించి కూడా ఎంఆర్‌ఐ టెస్టు చేయడం జరిగిందన్నారు.

నెక్ ఎంఆర్‌ఐలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి

నెక్ ఎంఆర్‌ఐలో కొంచెం ఇబ్బంది వచ్చిందని సిఎం వ్యక్తిగత వైద్యుడు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవి. రావు తెలిపారు. సిఎం
ఎక్కువగా వార్తా పత్రికలు చదువుతుండం…ఐ ప్యాడ్ చూస్తూ ఉంటారన్నారు. కాబట్టి ఆ సమస్య వచ్చిందన్నారు. న్యూరో ఫిజీషియన్లు కూడా అదే అభిప్రాయంతోతో ఉన్నారన్నారు. మీకందరికీ తెలుసు సిఎంకు కొంచెం బ్లడ్ ప్రెషరు, మధుమేహం ఉందని… అవన్నీ కంట్రోల్లో ఉన్నాయి. ఇతర పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. 90శాతం పరీక్షల రిపోర్టులు బాగున్నాయి. ‘ హార్ట్ కిడ్నీ, లివర్ ఫంక్షన్, కొలెస్టరాల్ లెవల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ‘ సో వారు ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంత వరకు వారికి బ్లడ్ ప్రెషరు, మధుమేహం కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పాం ని అన్నారు. దానికి కారణం ఏమిటంటే వారు ఈ మధ్య సిఎం టూర్లు ఎక్కువగా చేస్తుండటం వల్ల వారు కొంచెం నీరసంగా ఉన్నారన్నారు.

ఉపన్యాసాలు ఎక్కువగా ఇస్తున్నారన్నారు. వీటి వల్ల కొంత ఆయనకు ఇబ్బందులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో సిఎంకు విశ్రాంతి అవసరమని చెప్పామని డాక్టర్ ఎంవి రావు తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించామన్నారు. ఇప్పటి నుంచి ప్రతివారం రక్త పరీక్షలు, గ్లూకోజ్ ఎలా ఉందో పరీక్షలు చేస్తామన్నారు. వయసు రీత్యా వచ్చే సమస్యలు తప్ప, సిఎం బాగానే ఉన్నారు. సిఎం కింద పడ్డారా? అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు… “లేదు, ఆయన కింద పడలేదని.. ఎడమ చేయి నొప్పి అంటే ఇక్కడకు రమ్మని పరీక్షలు చేశామని సమాధానమిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News